It’s TDP Meeting:
తిరుపతిలో రేపు జరగనున్నది ముమ్మాటికీ రాజకీయ సభ… తెలుగుదేశం పార్టీ సభ… అని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. అమరావతి ఉద్యమం నడిపిస్తున్నదే చంద్రబాబు అని అయన ఆరోపించారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రేపు తిరుపతిలో తలపెట్టిన సభ, ప్రతిపక్ష నేత చంద్రబాబు హాజరు కావడంపై బొత్స స్పందించారు. ఈ పాదయాత్రలో, ఆందోళనలో పాల్గొంటున్న వారంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలేనని స్పష్టం చేశారు. టిడిపి నేరుగా ఉద్యమం చేయవచ్చని, జేఏసి ముగుసులో చేయాల్సిన అవసరం లేదని హితవు పలికారు.
తమకు 13 జిల్లాల అభివృద్ధి ముఖ్యమని, కానీ చంద్రబాబుకు మాత్రం ఆ 29 గ్రామాలు, ఆ సామాజిక వర్గం అభివృద్దే ముఖ్యమని, అదే తెలుగుదేశం పార్టీ అజెంగా అని బొత్స విమర్శించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలన్నది తమ అభిమతమని అందుకే మూడు రాజధానుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
రేపటి సమావేశంలో అల్లర్లు సృష్టించేందుకు వైసీపీ కుట్ర చేస్తోందంటూ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చేన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. రాజకీయ పార్టీ సభను అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. రాయలసీమ, ఉత్తర కోస్తా ప్రాంతాల్లో అమరావతిపై ఎలాంటి వ్యతిరేకత లేదని అచ్చెన్న చెప్పడంపై కూడా బొత్స మండిపడ్డారు. తాము కూడా ఓ అతి పెద్ద బహిరంగ సభ పెట్టి ఈ అభిప్రాయం తప్పు అని, మూడు రాజధానులకు ప్రజలు మద్దతు ఇస్తున్నట్లు నిరూపించగలమని అన్నారు.
రాయలసీమ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తిరుపతి, కర్నూలు ప్రాంతాల్లో జరుగుతున్న ఆందోళనలతో తమ పార్టీకి గానీ, ప్రభుత్వానికి గానీ ఎలాంటి సంబంధం లేదని బొత్స తేల్చి చెప్పారు. రాయలసీమ పరిరక్షణ సమితి అనేది తాము రాజకీయాల్లోకి రాకముందే ఏర్పడిన సంస్థ అని గుర్తు చేశారు.
Also Read : అభివృద్ధిపై దృష్టి పెట్టండి : లోకేష్ సూచన