హైదరాబాద్ నానక్ రామ్ గూడాలోని వీకే టవర్స్ లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీలు – సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వర రావు, జస్టిస్ హిమాకోహ్లి, సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ ఆర్వీ రవీంద్రన్, హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి లతో పాటు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
భారతదేశంలో ప్రప్రథమంగా హైదరాబాద్‌లో ఐఏఎంసీ ఏర్పాటు కావడం, సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ మనల్ని దీవించడం మనందరికి గర్వకారణమని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణను హృదయపూర్వకంగా, చేతులు జోడించి అభినందిస్తున్నానని కేసీఆర్ పేర్కొన్నారు. నానక్‌రామ్‌గూడలోని ఫోనిక్స్ వీకే టవర్స్‌లో 25 వేల చదరపు అడుగులలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. హైదరాబాద్‌ను అతిగా ప్రేమించే వ్యక్తుల్లో జస్టిస్ ఎన్వీ రమణ ఒకరు. ఐఏఎంసీ ఏర్పాటుకు ప్రధాన పాత్ర పోషించారు. నిజానికి ఇటీవలి కాలంలో మీరు హైదరాబాద్‌లో చాలా చేస్తున్నారు. సరియైన ప్రాపగండా చేస్తలేరు అని విదేశీ స్నేహితులు తనతో చెప్పారు. నిన్న కూడా ఇద్దరు ముగ్గరు ఫ్రెండ్స్ సింగపూర్ నుంచి వచ్చి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలను పరిశీలించారు. మీరు అసలు ప్రమోట్ చేయట్లేదు. హైదరాబాద్ సింగపూర్ కన్నా బాగుంది అని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా హైదరాబాద్ పురోగమిస్తోంది. అనేక రంగాల్లో హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారుతోంది. అందులో ఎటువంటి అనుమానం లేదు.
న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రక్రియలో అనేక కారణాల చేత కోర్టులలో పరిష్కారం కానీ కేసులు, ఆర్బిట్రేషన్ సెంటర్లలో పరిష్కారాలు లభ్యమవుతుండటం అనేది ఈరోజు ఇంటర్నేషనల్ ఫ్యాషన్. అట్లాంటి సౌకర్యం భారతదేశంలో ప్రప్రథమంగా హైదరాబాద్‌లో రావడం, రమణ మనల్ని దీవించడం మనందరికి గర్వకారణం. హైదరాబాద్‌ను ఈ స్థాయిలో నిలిపేందుకు చాలా మంది కృషి చేశారు. ఐఏఎంసీ.. దేశానికి, రాష్ట్రానికి, నగరానికి, మన వ్యవస్థకు మంచి పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. తప్పకుండా ఈ సెంటర్ అన్ని విధాలుగా ముందుకు పురోగమిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. కంపెనీలు, పెట్టుబడిదారుల మధ్య వివాదాలను పరిష్కరించడం ఈ సెంటర్ లక్ష్యం. రాష్ట్ర వివాదాలు ఆర్బిట్రేషన్ ద్వారా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్డినెన్స్ ద్వారా చట్టాలు తీసుకొస్తామన్నారు. మంచి ఉత్తమమైన సెంటర్‌ను ఇక్కడ తీసుకొచ్చేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు.