ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర సమితి నేతృత్వంలో రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ రైతులు, పార్టీ కార్యకర్తలు గ్రామగ్రామాన ఆందోళన బాటపట్టారు. ఉదయం నుంచే గ్రామాల్లో రైతులు చావు డప్పు వేస్తూ కేంద్రం దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారు. కొన్నిచోట్ల రైతులు కల్లాల వద్దే వరిగడ్డితో దిష్టిబొమ్మను రూపొందించి తగులబెట్టారు. కేంద్రం, బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గ్రామాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
ఆందోళనల అనంతరం ముఖ్య కూడళ్లలో ధర్నాలు నిర్వహించారు. త్రిపురారం మండలంలోని బడ్డాయిగడ్డలో వరి కళ్లాల వద్ద రైతులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. హుజూర్‌నగర్ మండలం శ్రీనివాసపురంలో రైతులు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను కాల్చివేశారు. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ వద్ద నిరసన కార్యక్రమంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేసిన గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్. ఆందోళనలో జెడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, ఎమ్మెల్యే శ్రీ శంకర్ నాయక్ మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, స్థానిక ప్రజా ప్రతినిధులుఇతర నాయకులు పల్గొన్నారు.
ఖమ్మం జిల్లా రఘునాధపాలెంలో టీఆర్ఎస్ నేతలు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు న్యాయం జరిగే వరకూ.. కేంద్రం దిగివచ్చే వరకూ.. కేంద్ర ప్రభుత్వంపై చావు డప్పు మోగించాలన్నారు.
ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిర్మల్ జిల్లా వ్యాప్తంగా రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. నిర్మల్ పట్టణం నిరసన కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ర్యాలీలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం నుంచి మంచిర్యాల చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్రం, బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దగ్దం చేశారు.