రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ శీతాకాల విడిది కొరకు ఈ నెల 29 నుండి జనవరి 3 వతేది వరకు హైదరాబాద్ బొల్లారం రాష్ట్రపతి నిలయంలో విడిదికై రానున్నారు. రాష్ట్రపతి రాకను పురస్కరించుకొని చేయవలసిన ఏర్పాట్ల గురించి వివిధ శాఖల అధిపతులతో హైదరాబాద్ బిఆర్ కెఆర్ భవన్ లో మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ చర్చించారు.
రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటనను తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టను, ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ గుర్తింపును మరింత ఇనుమడింప చేసే అవకాశంగా భావించాలని అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. తదనుగుణంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా రాష్ట్రపతి పర్యటన సౌకర్యవంతం చేయుటకు అన్ని విభాగాలు సమన్వయంతో వ్యవహరించాలని అధికారులకు స్పష్టం చేశారు.
రాష్ట్రపతి నిలయం వెళ్ళే మార్గంలో ట్రాఫిక్ సజావుగా నడిచేందుకు రోడ్డు మరమత్తు, బారికేడింగ్ పనులు చేపట్టాలని జిహెచ్ఎంసి కమీషనర్, కంటోన్మెంట్ బోర్డ్ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. రాష్ట్రపతి నిలయం వద్ద ప్రొటోకాల్ ప్రకారం విధులు నిర్వహించుటకు వైద్య బృందాలతో పాటు ఇతర శాఖల బృందాలను నియమించాలని తెలిపారు. నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ సరఫరాను నిర్ధారించాలని విద్యుత్ శాఖ ను ఆదేశించారు.
ఈ సమావేశంలో డిజిపి యం.మహేందర్ రెడ్డి, రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, జిఏడి ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, డిజి ఫైర్ సర్వీసెస్ సంజయ్ కుమార్ జైన్, అడిషనల్ డిజి జితేందర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం రిజ్వీ, టియస్ డైరీ డెవలప్ మెంట్ యండి అనితా రాజేంద్ర, TR&B కార్యదర్శి శ్రీనివాస్ రాజు, టిఎస్ టిఎస్ యండి.జి.టి వెంకటేశ్వర్ రావు, హార్టికల్చర్ డైరెక్టర్ ఎల్ . వెంకట్ రామ్ రెడ్డి, ప్రోటోకాల్ జాయింట్ సెక్రటరీ అర్విందర్ సింగ్, ఆల్ఇండియా రెడియో, బిఎస్ఎన్ ఎల్, ఏయిర్ పోర్ట్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Also Read : జమిలి ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు