Saturday, November 23, 2024
HomeTrending Newsతాలిబాన్  హెచ్చరిక – పాక్ లో ప్రకంపనలు

తాలిబాన్  హెచ్చరిక – పాక్ లో ప్రకంపనలు

 

తాలిబాన్ మళ్ళీ జూలు విప్పుతోంది. ఆఫ్ఘన్ సరిహద్దు దేశాల్లో అమెరికా మిలిటరీ బేస్ కు అనుమతిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. అయితే ఏ దేశం పేరు ప్రస్తావించ లేదని ఆఫ్ఘానిస్తాన్ మీడియా స్పష్టం చేసింది. అమెరికా ప్రభుత్వం పాకిస్తాన్ లో కొత్త మిలిటరీ బేస్ కోసం మంతనాలు చేస్తోందని పాక్, ఆఫ్ఘానిస్తాన్ మీడియాలో మూడు రోజుల నుంచి వరుస కథనాలు వస్తున్నాయి. మే 23 వ తేదిన జెనివాలో పాకిస్తాన్ భద్రతా సలహాదారు మొయిద్ యోసుఫ్, అమెరికా ప్రతినిధి జాక్ సువిలన్ తో భేటి అయ్యారు. వీరి సమావేశంలో మిలిటరీ బేస్ పైనే చర్చ జరిగినట్టు సమాచారం. దీంతో  తాలిబాన్ తాజా హెచ్చరికలు జారి చేసింది.

మరోవైపు తమ దేశ భూభాగంలో అమెరికాకు  ఎలాంటి మిలిటరీ బేస్ కు అనుమతి ఇచ్చేది లేదని పాక్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషి పార్లమెంట్ లో  వెల్లడించారు. అలాంటి ఆలోచన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఏనాడు చేయదని ఖురేషి స్పష్టం చేశారు. కేవలం వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల అభివృద్ధి పైనే రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇందు కోసం 14 మంది మంత్రులతో ఒక కమిటీ కూడా వేసినట్టు ఖురేషి వివరించారు.

పాక్ లో మిలిటరీ బేస్ వార్తలను ఆఫ్ఘన్ లో అమెరికా మిలిటరీ ప్రతినిధి సున్నీ లేగ్గేట్ కూడా ఖండించారు. ఆఫ్ఘన్ నుంచి నాటో దళాల ఉపసంహరణ ప్రకటన వేలువడినప్పటి నుంచి తాలిబాన్ క్రమంగా పట్టు బిగిస్తోంది. దేశ పాలనా పగ్గాలు తమకే దక్కుతాయనే నమ్మకంతో ఇటివల తమ ఆధీనంలో  బందీలుగా ఉన్న ఆఫ్ఘన్ సైనికుల్ని, ప్రజలను విడుదల చేస్తున్నారు.  తాలిబాన్ అద్వర్యంలో ఉన్న  హేరాత్ , భాగ్లన్ జైళ్ళ నుంచి సుమారు వంద మంది బందీల్ని విడుదల చేశారు. అయితే ఆఫ్ఘన్ మిలిటరీ ఆపరేషన్ వల్లే బందీలను విడుదల చేశారని ఆఫ్ఘన్ రక్షణ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.

రాబోయే రోజుల్లో తాలిబాన్ విస్తరణ జరగటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో పాకిస్థాన్ కు ముప్పు తప్పదు. తాలిబాన్ తాజా ప్రకటనలతో పాక్ లోని ఆఫ్ఘన్ సరిహద్దు ప్రాంతాల ప్రజలు మళ్ళి చీకటి రోజులు రాబోతున్నాయని భయపడుతున్నారు. భారత ప్రభుత్వం కూడా ఆఫ్ఘన్ పరిణామాల్ని నిశితంగా గమనిస్తోంది. కశ్మిర్, లడఖ్ సరిహద్దుల్లో నిఘా ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఇజ్రాయెల్ నుంచి అత్యాధునిక హెరాన్ డ్రోన్ లను దిగుమతి చేస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్