Saturday, November 23, 2024
Homeసినిమా‘అర్జున ఫల్గుణ’ సంక్రాంతిని ముందే తెస్తుంది : డైరెక్టర్ తేజ మర్నీ

‘అర్జున ఫల్గుణ’ సంక్రాంతిని ముందే తెస్తుంది : డైరెక్టర్ తేజ మర్నీ

Early Sankranthi: కమర్షియల్ చిత్రాలను తెరకెక్కిస్తూనే.. అద్భుతమైన కథలను ఎంపిక చేసుకుంటూ.. యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తోంది మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్. శ్రీ విష్ణు హీరోగా, అమృతా అయ్యర్ హీరోయిన్‌గా ఎన్ ఎమ్ పాషా కో ప్రొడ్యూసర్‌గా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను తేజ మర్ని నిర్వహించారు. అర్జున ఫల్గుణ చిత్రం డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో దర్శకుడు తేజ మర్ని మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయ‌న మాట‌ల్లోనే..

‘జోహార్’ కంటే ముందుగానే ఈ కథ ఉంది కానీ.. అప్పుడున్న పరిస్థితుల్లో అది పూర్తిగా సిద్దం కాలేదు. ‘జోహార్’ తరువాత చాలా ఆఫర్లు వచ్చాయి. గోదావరి బ్యాక్ డ్రాప్‌లో కథ చేయాలని ఉండేది. అలా ఈ కథను విష్ణు గారికి వినిపించాను. ముందుగా ఈ సినిమాకు ఈస్ట్ గోదావరిలో దొరికిన‌ కూల్ డ్రింక్ ఆర్జోజ్‌ను టైటిల్‌గా పెట్టాలని అనుకున్నాం కానీ.. వాళ్లు పర్మిషన్ ఇవ్వలేదు. టైటిల్ లేకపోతే కథ అంతా మార్చాల్సి వస్తుందని విష్ణు, నేను మాట్లాడుకుంటూ ఉన్నాం. అలా ఓ సారి అర్జున ఫల్గుణ గురించి మాట్లాడుతూ.. అలా అంటే ధైర్యం వస్తుందట అని అనుకున్నాం. వెంటనే శ్రీ విష్ణు గారు ఆ టైటిల్‌ బాగుందని అన్నారు.

Arjuna Phalguna

సినిమాలో హీరో కారెక్టర్ పేరు కూడా అర్జున్. అర్జున ఫల్గుణ అనే టైటిల్ పెట్టాకే సినిమా స్పాన్ మారిపోయింది. ఊర్లో ఉన్నంత సేపు అర్జునుడు. ఊరి దాటాక ఫల్గుణుడిగా ఎలా మారాడన్నదే కథ. సినిమాకు టైటిల్ చాలా ముఖ్యం. కథకు తగ్గట్టుగా టైటిల్ ఉండాలి. అర్జున ఫల్గుణ అని టైటిల్ పెట్టాకే కథలో మార్పులు చేశాను. యాక్షన్ పెంచాను. స్పాన్ పెంచాను. మార్పుల పట్ల నిర్మాతలు సంతోషంగానే ఉన్నారు. సిటీలో ఎంత సంపాదించినా మిగిలేది కొంతే. అదే ఊర్లో ఉండి సంపాదించుకుంటే బెటర్ కదా? అని ఎంతో మంది అనుకుంటూ ఉంటారు. అలాంటి ఊరి కుర్రాళ్ల కథే అర్జున ఫల్గుణ.

ప్రతీ రోజూ ఉదయం ఆరు గంటలకు షాట్ పెట్టేవాళ్లం. సన్ సెట్ ఎప్పుడూ కూడా వదల్లేదు. ప్రతీ ఒక్కరూ ఎంతో కో ఆపరేట్ చేశారు. గోదావరిలోని అందాలను కొత్త కోణంలో చూపించబోతోన్నారు. వంశీ గారు, కృష్ణవంశీ గారి ప్రభావం మాత్రం కచ్చితంగా ఉంటుంది. అక్కడి వాతావరణం, జీవన విధానం నాకు చాలా ఇష్టం. అర్జున ఫల్గుణ సినిమాలోని మెయిన్ పాయింట్, టర్నింగ్ సీన్స్, కథలు నిజంగానే జరిగాయి. నా ఫ్రెండ్స్, వాళ్ల ఫ్రెండ్స్ ఇలా అందరి జీవితాల్లో జరిగిన వాటిని ఈ కథలో పెట్టాను.

ఈ కథను శ్రీ విష్ణు గారి బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగానే రాసుకున్నాను. వేరే హీరోను అస్సలు అనుకోలేదు. గోదావరి యాస ఉండాలని పెట్టుకున్నాను. సింధూరంలో రవితేజ గారిని చూసిన ఫీలింగ్ వస్తుంది. యాక్షన్ పరంగా కొత్త విష్ణును ఇందులో చూడొచ్చు. సినిమాలోని ఐదు పాత్రలు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్. రియలిస్టిక్‌గా ట్రీట్ చేశాం. నేను కూడా ఎన్టీఆర్ అభిమానినే. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ద్వితీయార్థంలో థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటి? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఇక క్లైమాక్స్‌లో అయితే.. అందరూ ఎమోషనల్ అవుతారు. ఇందులో ఐదు పాటలుంటాయి. అన్నీ కూడా కథలో భాగంగానే వస్తాయి.

తన సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూసుకోవాలనే కల ప్రతీ దర్శకుడికి ఉంటుంది. నా మొదటి సినిమాతో అది నెరవేరలేదు. అప్పుడు సినిమాను నేనే నిర్మించుకోవడం వల్ల ఒత్తిడిని తట్టుకోలేకపోయాను కానీ.. ఇప్పుడు మంచి నిర్మాతలున్నారు. దిల్ రాజు గారు రిలీజ్ చేస్తున్నారు. ఏపీలో ఎన్ని థియేటర్లు దొరుకుతాయో అని అనుకుంటున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ సినిమా అయినా కూడా వారమే. సినిమా బాగుంటే.. ఇంకో వారం ఆడుతుంది. ఆర్ఆర్ఆర్ తరువాత ఇంకే సినిమాలు కూడా కనబడవు.

ఇందులో ఎన్టీఆర్ మీద, ఆర్ఆర్ఆర్ మీద కొన్ని డైలాగ్స్ ఉంటాయి. కాబట్టి ముందే రిలీజ్ అవ్వాలి. మామూలుగా అయితే.. ఈ సినిమాను సంక్రాంతికి ప్లాన్ చేశాం. ఈ డిసెంబర్ 31న సంక్రాంతిని తీసుకొద్దామని అనుకుంటున్నాం. మా సినిమాను చూశాక ఊరికెళ్లాలనిపిస్తుంది. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ 2, షైన్ స్క్రీన్ బ్యానర్లలో సినిమాలు చేస్తున్నాను. ఇక పై నేను కమర్షియల్ సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. కానీ ఏ సినిమా చేసినా కూడా ఎమోషన్ మాత్రం ఉండాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్