దేవిశ్రీ స్థాయికి లోకం ఎప్పుడు ఎదుగుతుందో?

సుమారు 15-16 ఏళ్ల వయసులో ఒకసారి ఎదో ఒక దివ్యానుభూతి కలిగి “నాన్ యార్?(Who am I?) అని జన్మతః తమిళవారు అవ్వడం వల్ల తమిళంలో ప్రశ్నించుకొని.. తనెవరో తెలుసుకోవడానికి అరుణాచలం చేరిన వెంకట్రామయ్యర్ అక్కడ “భగవాన్ రమణులు”గా మారి పోయారు.  ఆయనకు తర-తమ భేదం లేదు, మానవులకు-పశు పక్ష్యాదులకు తేడా లేదు.. అన్ని జీవులని సమానంగా చూశారు.  తాను కాని ఈ శరీరానికి ఆచ్చాదన కూడా అవసరం లేదని ఆయన భావించారు.  అనుయాయుల కోరికపై కౌపీనం మాత్రం ధరించి నిరాడంబరంగా జీవితాన్ని గడిపారు.

అలానే దాదాపు 280 సంవత్సరాలు జీవించారని చెప్పుకొనే మన తెలుగు  త్రైలింగ స్వామి వారు కూడా నిర్వికారులు, సర్వ సమదృష్టి కలవారు, దేహ స్పృహ లేనివారు.  వారు వారణాసి వీధులలో దిగంబరం గా తిరుగుతూ “ఇండీసెంట్” గా ప్రవర్తిస్తున్నారని పోలీసులు కేసు పెట్టి,  మాజిస్త్రేట్ ముందు హాజరు పరిస్తే, ఆ మేజిస్ట్రేట్ వీరిని అవమాన పరచడానికి తాము తినే మాసాహారం మీరు తింటారా అని ప్రశ్నిస్తే…ఆయనకు అర్థమయ్యే విధంగా వివరణ ఇవ్వడంతో…కేసు కొట్టేశారు.

ఇక పరమహంస రామ కృష్ణులు అయితే ఆయన పూజించే దక్షిణ కాళీ దేవి రూపాన్నే విటుల కోసం వేచి చూసే “వారాంగనలలో” చూసి వాళ్ళ కాళ్ళకే మొక్కే వారు.   చెత్త కుప్పలపై విసరబడ్డ ఆహారాన్నే కుక్కలతో పాటు పంచుకొంటూ తినే వారు.  వారిది కూడా సర్వ ప్రాణులపట్ల సమదృష్టి.

ఇలా సర్వ ప్రాణులందు సమదృష్టిని, అన్ని అవస్థలందు సమత్వాన్ని ప్రదర్శిస్తూ భావోద్వేగాలకు అతీతంగా, దేహ భావానికి అతీతంగా జీవించిన వారు అతి కొద్దిమంది. అందుకే వారిని మనం అపురూపంగా మనకు మార్గదర్శకులుగా, గురు స్వరూపులుగా,కారణ జన్ములుగా భావిస్తూ గౌరవిస్తాం.

అయితే ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో సమదృష్టిని, సమత్వాన్నిప్రదర్శించే వారు మనకు కనబడడం దాదాపు మృగ్యం అవుతుందని అనుకొంటున్నాదశలో నేను ఉన్నాను అంటూ ముందు కొచ్చాడు మన దేవి శ్రీ ప్రసాద్.

 ఆయనకు Work is Worship – Duty is God.

మ్యూజిక్ డైరెక్టర్ గా పాటలకు ట్యూన్ కట్టడం ఆయన వృత్తి. లేదా ముందే ట్యూన్ లు కట్టి ఇచ్చి ఇవ్వడం ఆయన పని.  ఆ ట్యూన్ లు జనాలకు క్యాచీ గా ఉండేలా చూసుకొంటే నాలుగు రూకలు ఎక్కువస్తాయి కాబట్టి ఆయన ఆవిధంగా ట్యూన్ లు కట్టడంలో ఎవరికీ ఇబ్బంది లేదు.

పాట కు వచ్చే పారితోషికం పట్ల తప్ప..  పాట సాహిత్యంతో పాపం ఆయనకు పెద్ద పట్టింపు లేదు.

పాట ఎవరు పాడుతున్నారు, ఎక్కడ పాడుతున్నారు, ఎందుకు పాడుతున్నారు, ఎవరి గురించి పాడుతున్నారు, పాట లో ఏమి చెపుతున్నారు తో అసలు సంబంధం లేదు.

ఆయన పనిని ఆయన ప్రేమిచడంలో తప్పు లేదు.  దాని పట్ల ఆయనకు భక్తీ వుండడం లోనూ తప్పు లేదు.

తను స్వరపరచిన ట్యూన్ బాగుంటే.. అది బాగుందని చెప్పుకొన్నా తప్పు లేదు.

అయితే తనకు భక్తి గీతం ఎలాంటిదో, “మసాలా సినిమాలలో” రక్తి గీతం (ఐటెం సాంగ్) అలాంటిదే అని పోల్చడం తోనే వచ్చింది చిక్కు. రెండింటి గురించి ఆయన పడే కష్టం ఒకటే అని ఆయనకు అనిపించినా ఇక్కడ పోలిక పోసగదు.

అసలు ఈ రెండింటిని పోల్చాల్సిన అవసరం లేదు, అగత్యం లేదు.

ఎందుకంటే రక్తి దారి రక్తిది .. భక్తి దారి భక్తిది. ఈ రెండిటికి పోలిక పెట్టడమే తప్పు.

 దేవిశ్రీ గారు రక్తి-భక్తి విషయంలో  సమదృష్టి గల వారు కాబట్టి.. వారికి

భక్తి పారవశ్యంలో ఊగే భక్తులు .. మత్తులో ఊగే “నిషా చరులు”,

భక్తుల ఉచ్చ్వాస-నిశ్వాసాలు .. “వెలయాళ్ళ ఊర్పులు-నిట్టూర్పులు”

భక్తుల నృత్యాలు .. తాగుబోతుల చిందులు

భగవంతుని రూపాన్ని,గుణాన్ని వర్ణించే అమలిన భక్తి గీతాలు.. మద విహ్వలుల కాంక్షలను విశద పరిచే మలిన శృంగార గీతాలు.. ఒకేలా కనబడవచ్చు.

 కాని ప్రజలు “ఆ స్థాయికి” ఇంకా ఎదగలేదు. ఇప్పట్లో ఎదుగుతారన్న నమ్మకమూ లేదు.

ఉప్పు కప్పురంబు ఒక్క పోలికే ఉన్నా.. మన ఇష్టం వచ్చినట్లు పోల్చడానికి కుదరదు అని.. చూడ, చూడ వాటి రుచుల జాడ వేరు అని.. మన వేమన ఎప్పుడో చెప్పిన సదరు సత్యం మన దేవి శ్రీ గారి మెదడు కు ఎక్కినట్లు లేదు.

“పుష్ప” సినిమా లో ఆయన స్వరపరిచిన “ఊ.. అంటావా.. ఊ హూ అంటావా… “ అనే ఐటెం భక్తి గీతం

ఆ నోట, ఈ నోట, చివరకు పాపం “అన్నమయ్య  శోభారాజు” గారి చెవిన పడి, దాంట్లో ఉన్న అద్భుతమైన సాహిత్యం వినలేక, తనకు తోచిన విధంగా నాలుగు పదాలు మార్చుకొని, అదే ట్యూన్ లో ఆ భగవంతుడికి సమర్పిస్తే.. దాన్ని ఆవిడ కూడా ఇష్టపడ్డట్లు దేవి శ్రీ గారు ఊహించేసుకోవడం కూడా ఉచితం అనిపించదు.

సదరు వీరి పోలిక వెనుక వీరి పరమార్ధం, అంతరార్ధం ఏమైనా..వీరి పాండిత్యాన్ని ప్రస్తుతానికి మ్యూజిక్ కే పరిమితం చేసుకొని, అలంకార శాస్త్రం వైపుకు వెళ్లి ఉపమానాలను, ఉపమేయంగా ఊహించడం లేదా ఉపమానాలకు, ఉపమేయాలకు పొసగని సామ్యం చెప్పడము వంటివి, కనీసం జనం “వారి స్థాయి” కి ఎదిగే వరకు “దేవి శ్రీ” గారు మానుకోవడమే సమయోచితం ఏమో.

 (భగవాన్ రమణులకు, త్రైలింగ స్వామి వారికి, రామకృష్ణ పరమహంస లకు  భేషరతు క్షమాపణలతో)

 -శ్రీ వెంకట సూర్య ఫణి తేజ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *