మహారాష్ట్రలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 454 కేసులు వెలుగు చూశాయి. ప్రజాప్రతినిధులు కూడా ఎక్కువ సంఖ్యలో కొవిడ్ బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వైరస్ వ్యాప్తికి కారణమయ్యాయి. ఈ సమావేశాలకు హాజరైన 10 మంది మంత్రులు.. మరో 20 మందికిపైగా ఎమ్మెల్యేలకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ వెల్లడించారు. దీంతో శాసనసభ శీతాకాల సమావేశాలను కుదించినట్టు తెలిపారు. తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి ఉద్దావ్ ధాకరే నేతృత్వంలో టాస్క్ ఫోర్సు ఈ రోజు సమావేశామవుతోందన్నారు. ముంబై, పూణే నగరాల్లో కరోనా కేసుల వ్యాప్తి వేగంగా జరుగుతోందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే కఠిన ఆంక్షలు తప్పవని హెచ్చరించారు.
మరోవైపు బాలీవుడ్ లో కేసులు పెరుగుతున్నాయి. హీరో అర్జున్ కపూర్, ఆయన సోదరి అన్షుల కపూర్, మరో సోదరి రియా కపూర్, ఆమె భర్త కరణ్ బూలనిలు కరోనా బారిన పడ్డారు. అర్జున్ కపూర్ గత సెప్టెంబర్ లో కోవిడ్ బారిన పడగా తాజాగా మరోసారి సోకింది. తెలుగు హీరో మహేష్ బాబు మరదలు, హీరోయిన్ శిల్ప శిరోద్కర్ కరోనాతో క్వారంటైన్ లో ఉన్నట్టు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తను కూడా కోవిడ్ కు చికిత్స తీసుకుంటున్నా అని అందరు జాగ్రత్తగా ఉండాలని గ్లామరస్ హీరోయిన్ నూరఫతేహి సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
అటు దేశవ్యాప్తంగా 22.775 కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి తో గత 24 గంటల్లో 406 మంది చనిపోయారు.