No early election: ప్రతిపక్ష నేత చంద్రబాబు తన కేడర్ ను కాపాడుకునేందుకే ముందస్తు ఎన్నికలంటూ మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ లోక్ సభా పక్ష నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాము ఐదేళ్ళుకాలం పూర్తయిన తరువాతే ఎన్నికలలు వెళ్తామని, ముందస్తుకు వెళ్ళే ఎలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. తిరుపతి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన రోబో రెస్టారెంట్ లో ఆన్లైన్ బుకింగ్ మొబైల్ అప్లికేషన్ ను మిధున్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కె.ఆర్.జయేంద్ర భరత్ కూడా పాల్గొన్నారు. అక్కడ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు మిథున్ రెడ్డి స్పందించారు.
కరోనా సమయంలో ప్రైవేట్ ఆస్పత్రులు పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేస్తుంటే ప్రభుత్వం దాని నియంత్రణకు చర్యలు తీసుకుందని, కోవిడ్ చికిత్సకు ఫీజు నిర్ణయించి అదే ఫీజు వసూలు చేయాలని నిబంధన పెట్టిందని మిథున్ రెడ్డి గుర్తు చేశారు. అదే కోవలో సినిమా టిక్కెట్లపై కూడా నియంత్రణ విధించిందని వెల్లడించారు. ప్రేక్షకులకు, థియేటర్ల యజమానులకు నష్టం కలగాకూదదన్నని ప్రభుత్వ అభిమతమని, కమిటీ నిర్ణయం మేరకు టికెట్ రేట్లపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ప్రత్యేక హోదా అంశంపై తమ పోరాటం కొనసాగుతుందని, ఎంపీలుగా తాము లోక్ సభలో పోరాడుతున్నామని, సిఎం జగన్ కూడా ఎప్పటికప్పుడు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకు వెళుతున్నారని, అవకాశం ఉన్న ప్రతి వేదికపైనా హోదాపై తమ ప్రయత్నం చేస్తూనే ఉన్నామని వివరించారు. కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ నాయకత్వంలో వైఎస్సార్సీపీ పటిష్టంగా తయారవుతోందని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడిస్తామని మిథున్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.