Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్రూట్ కు బెన్ స్టోక్స్ మద్దతు

రూట్ కు బెన్ స్టోక్స్ మద్దతు

Stokes with Root: ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ కు ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ బాసటగా నిలిచాడు. అతని సారధ్యంలో ఆడేందుకు తానెంతో ఇష్టపడతానని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో ప్రస్తుతం జరుగుతోన్న యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టు  పేవలమైన ప్రదర్శనతో ఐదు టెస్టుల సిరీస్ ను ఇంకా రెండు టెస్టులు మిగిలి ఉండగానే 3-0 తో కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దారుణ ఓటమిపై ఇంగ్లాండ్ క్రికెట్ అభిమానులతో పాటు పలువురు విశ్లేషకులు ఇంగ్లాండ్ సారధి జో రూట్ పై విమర్శలు కురిపిస్తున్నారు. వెంటనే అతణ్ణి మార్చి వేరొకరికి కెప్టెన్సీ అప్పగించాలని సూచిస్తున్నారు.

జూలై 2020లో రూట్ పెటర్నిటీ లీవ్ పై వెళ్ళినప్పుడు నాటి వెస్టిండీస్ సిరీస్ కు బెన్ స్టోక్స్ సారధ్యం వహించాడు. గత ఏడాది వేసవిలో పాకిస్తాన్ తో జరిగిన వన్డే సిరీస్ కు కూడా స్టోక్స్ కెప్టెన్ బాధ్యతలు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో రూట్ వారసుడిగా స్టోక్స్ అయితే బాగుంటుందని విశ్లేషకులు సలహా కూడా ఇస్తున్నారు. ఈ వార్తలపై బెన్ స్పందించాడు.

సారధి కావాలన్న ఆలోచన తనకెంతమాత్రమూ లేదని, రూట్ సారధ్యంలో ఆడడం గొప్ప గౌరవంగా భావిస్తానని వెల్లడించాడు. అయితే కెప్టెన్ గా కొనసాగాలా లేదా అనేది రూట్ వ్యక్తిగతమని, దానిపై తానేమీ మాట్లాడబోనని చెప్పాడు.

ఓటమికి కేవలం కెప్టెన్ నే బాద్యుడిని చేయడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. జట్టు కూర్పు, ఫీల్డింగ్, ఇతర విధాన నిర్ణయాల్లో కెప్టెన్ పాత్ర ఉండొచ్చు కానీ గ్రౌండ్ లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సిన బాధ్యత మిగిలిన ఆటగాళ్ళపై కూడా ఉంటుందని చెప్పుకొచ్చాడు. రూట్ నాయకత్వంలో ఇంగ్లాండ్ ఎన్నో అద్భుత మైన విజయాలు సాధించిందని, గొప్పగా రాణించిందని, అయితే ప్రస్తుత యాషెస్ లో ఆశించిన స్థాయిలో ఆడలేకపోయిందని అంగీకరిస్తూనే… ఇది సమిష్టి వైఫల్యమేనని స్పష్టం చేశాడు.

ఇప్పటికి ముగిసిపోయిందేమీ లేదని, మిగిలిన రెండు టెస్టుల్లో తమ సత్తా చాటి ఆస్ట్రేలియాను నిలువరిస్తామని స్టోక్స్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా, యాషెస్ లో భాగంగా నాలుగో టెస్ట్ మ్యాచ్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో జనవరి 5, బుధవారం నుంచి ప్రారంభం కానుంది

Also Read : ఆస్ట్రేలియాదే యాషెస్ సిరీస్

RELATED ARTICLES

Most Popular

న్యూస్