Bully Boy : ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. ప్రజలు శాశ్వతం. ఈ సత్యం చాలా మంది పాలకులకు, ప్రజలకు తెలియకపోవడమే అసలు విషాదం. తెలిస్తే ఇన్ని నేరాలు, ఘోరాలు జరగవు. ప్రజా సంక్షేమం, మహిళల రక్షణ ప్రాధమ్యాలుగా చెప్పుకునే ప్రభుత్వాలు సిగ్గుపడే కొన్ని సంఘటనలు ఈ మధ్య జరిగాయి. ఇంజనీరింగ్ చదివిన ఒకమ్మాయి మారుపేరుతో బుల్లీ బాయ్స్ ఆప్ లో కొందరు ముస్లిం మహిళల ఫోటోలు మార్ఫింగ్ చేసి వేలానికి పెట్టడం దేశాన్ని కుదిపేసింది. విచారణలో రోజుకో కారణం, దోషులు బయట పడుతున్నారు. రోజురోజుకీ పెరుగుతున్న మత విద్వేషానికి ఇదొక నిదర్శనం. ఎవరైతే అన్యాయానికి వ్యతిరేకంగా గళం ఎత్తుతున్నారో వారిని ఇలాంటి సమస్యల్లో ఇరికిస్తున్నారు. హైద్రాబాదుకు చెందిన కొందరు జర్నలిస్టుల ఫోటోలను మార్ఫింగ్ చేసి ఫేస్బుక్ పేజీలో పెట్టుకున్నాడో మతోన్మాది. రిపోర్ట్ చేసినా చర్యలుంటాయని ఆశలు లేవు. సోషల్ మీడియాపై నిఘా ఉందనే ప్రభుత్వాలకు ఇటువంటివి పట్టవు కాబోలు.
బేటీ బచావో బేటీ పడావో అని మన ప్రధాని గొప్పగా ఇచ్చిన నినాదం అన్ని ఊళ్లలో కనిపిస్తోంది. అందుకే దూరమైనా భారమైనా అమ్మాయిలని చదివిస్తున్నారు. వారికి కనీస సౌకర్యాలు కల్పించలేకపోతోంది ప్రభుత్వం. బస్ సౌకర్యం లేని కారణంగా గతంలో హాజీపూర్ లో చిన్నారులపై జరిగిన దారుణాలు మరచిపోలేదు. అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు నెరవేరలేదు. తాజాగా పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తున్న అమ్మాయిని మాయమాటలతో బండి ఎక్కించుకుని అత్యాచారం చేసిన ఘటన సిగ్గుచేటు. కళ్ళముందే ఇన్ని జరుగుతున్నా చీమ కుట్టినట్టు ఉండని ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధులు మనకు అవసరమా! స్వతంత్ర భారతంలో స్వేచ్ఛగా చదువుకోడానికి అమ్మాయిలు ఇంకా ఎన్ని పోరాటాలు చెయ్యాలి? పాఠశాల విద్యావిద్యకన్నా ముందు ఆత్మరక్షణ విద్యలు నేర్వాలా! కనీస వసతులు కల్పించలేని ప్రభుత్వాలు ఎప్పటికి కళ్ళు తెరుస్తాయి?
-కె. శోభ