Saturday, November 23, 2024
HomeTrending Newsలాక్ డౌన్ ప్రసక్తే లేదు - పాకిస్తాన్

లాక్ డౌన్ ప్రసక్తే లేదు – పాకిస్తాన్

కరోనా వైరస్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉన్నా లాక్ డౌన్ విధించే ప్రసక్తే లేదని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. స్కూల్స్, కార్యాలయాలు అన్ని రకాల వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు నిరాటంకంగా నిర్వహించుకోవచ్చని పాక్ ప్రభుత్వం స్పష్టంచేసింది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందని ఈ దశలో లాక్ డౌన్ విధిస్తే ఆర్థికంగా కుదేలవుతుందని పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి పేర్కొన్నారు. పాకిస్తాన్ మంత్రివర్గం సమావేశం తర్వాత ఆయన మీడియా తో మాట్లాడుతూ దేశంలో ఎట్టి పరిస్థితుల్లో లాక్ డౌన్ విధించే ప్రసక్తే లేదని, కోవిడ్ వ్యాప్తి,  తాజా పరిణామాలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని వెల్లడించారు. ప్రజలు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తే కరోనా వ్యాప్తిని కట్టడి చేయవచ్చన్నారు. దేశ ప్రజలందరూ టీకా తీసుకోవాలని మంత్రి కోరారు. వ్యాక్సిన్ కోసం పాకిస్తాన్ ప్రభుత్వం రెండు బిలియన్ల అమెరికన్ డాలర్లు వెచ్చించిందని, ప్రజలు వ్యాక్సినేషన్ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

పాకిస్తాన్ లో అధికారిక లెక్కల ప్రకారం 15 వందల కేసులు గత 24 గంటల్లో నమోదయ్యాయి. అధికారిక లెక్కలు ఈ విధంగా ఉన్నా అనధికారికంగా లక్షకు సమీపంలో కేసులు వస్తున్నాయని పాక్ మీడియా కథనాలను పరిశీలిస్తే అవగతం అవుతోంది. పాజిటివిటి రేటు 16 గా ఉంది. సింద్, పంజాబ్ రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా వస్తున్నాయి. పాక్ గ్రామీణ ప్రాంతాల్లో వైద్య రంగం దారుణంగా ఉంది. కనీస మౌలిక వసతులు, సిబ్బంది లేరు.

పాకిస్తాన్ లో ద్రవ్యోల్భణం 8.9కి పెరిగి నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. ధరలు పెరగటం, మందుల కొరత ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. దీంతో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఈ నెలలో చైనా వెళుతున్నారు. ఆర్ధిక వ్యవస్థ గాడిలో పెట్టేందుకు గతంలో అమెరికా అండగా ఉండేది, ఇప్పుడు అగ్రరాజ్యం చేతులు ఎత్తేయటంతో పాక్ ప్రభుత్వం చైనా సహకారం కోసం ఎదురు చూస్తోంది. చైనా ప్రాజెక్టులపై ఇప్పటికే బెలూచిస్తాన్, సింద్, ఆక్రమిత కాశ్మీర్ లలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ తరుణంలో ఇమ్రాన్ ఖాన్ చైనా పర్యటన ఎంతవరకు ఫలితాలు ఇస్తుందో వేచి చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్