రెండేళ్ళ పాలన సంతృప్తినిచ్చిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో 86 శాతం కుటుంబాలకు ఏదో ఒక ప్రభుత్వ పధకాన్ని అందించగాలిగామని సంతోషం వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో చెప్పని అంశాలను కూడా అమలు చేశామన్నారు. ప్రజల దీవెనలతో…దేవుడి దయతోనే…. లంచాలు లేకుండా, వివక్షకు తావులేకుండా ప్రతి పథకాన్ని ప్రజల గడప వద్దకే నేరుగా అందించగాలిగామన్నారు.
ఒక కోటి 64 లక్షల 68 వేల 591 కుటుంబాలు ఉంటే అందులో 1 కోటి 41 లక్షల 52 వేల 386 కుటుంబాలకు లబ్ధి చేకూరిందని వివరించారు. ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) కింద నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి 95,528 కోట్ల రూపాయలు జమ చేశామని… పరోక్ష డీబీటీ కింద 36,197.05 వేల కోట్లు లబ్ధి చేకూరిందని మొత్తంగా రూ.1,31,725 కోట్ల రూపాయలు ఆయా కుటుంబాలకు అందాయని గణాంకాలతో సహా జగన్ వివరించారు.
రెండేళ్ళ పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రెండు పాలసీ డాక్యుమెంట్లను జగన్ విడుదల చేశారు. మొదటిది శ్రీకాకుళం జిల్లా జి. సిగడాం మండలం వడ్రంగి గ్రామ సచివాలాయానికి చెందిన కంది ఆది లక్ష్మి కుటుంబానికి రెండేళ్ళ కాలంలో ఎంత మేరకు లబ్ధిచేకూరిందో తెలియజేస్తూ ఒక లేఖ రాశారు. రెండవది ‘మలి ఏడు – జగనన్న తోడు’ పేరిట ఇప్పటి వరకూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేసిందీ, వాటికి ఎంత ఖర్చు చేసిందీ తెలియజేస్తూ మరో డాక్యుమెంట్ విడుదల చేశారు.
రెండేళ్ళ పాలన విజయవంతం కావడానికి సహకరించిన గ్రామ వాలంటీర్ల నుంచి, కలెక్టర్ల వరకు, మంత్రులకు, రాష్ట్ర స్థాయి అధికారులకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు జగన్.