Ashes 5th Test: యాషెస్ సిరీస్ లో ఐదో టెస్ట్ లో ఆస్ట్రేలియా ఆరు వికెట్లకు 241 పరుగులు చేసింది. హోబార్ట్ లోని బెల్లి రివర్ ఓవల్ మైదానంలో నేడు మొదలైన ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఇంగ్లాండ్ బౌలర్లు రాబిన్సన్, స్టువార్ట్ బ్రాడ్ రాణించడంతో ఆసీస్ 12 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. నాలుగో వికెట్ కు లాబుస్ చేంజ్, ట్రావిస్ హెడ్ లు 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 44 పరుగులు చేసిన లాబుస్ చేంజ్ బ్రాడ్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. హెడ్- కామెరూన్ గ్రీన్ లు ఐదో వికెట్ కు 121 పరుగులు చేశారు. ట్రావిస్ హెడ్ సెంచరీ(101) చేసి అవుట్ కాగా, గ్రీన్ 74 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అలెక్స్ క్యారీ -10; మిచెల్ స్టార్క్-0 పరుగులతో క్రీజులో ఉన్నారు. బ్రాడ్, రాబిన్సన్ చెరో రెండు; మార్క్ వుడ్, క్రిస్ ఓక్స్ చెరో వికెట్ పడగొట్టారు.
ఇంగ్లాండ్ జట్టులో ఐదు మార్పులు చేశారు. హమీద్, బెయిర్ స్టో, జోస్ బట్లర్, ఆండర్సన్, జాక్ లీచ్ లను తప్పించారు. బర్న్స్, ఓలీ పోప్, బిల్లింగ్స్, ఓక్స్, రాబిన్సన్ లకు చోటు కల్పించారు.
ఆస్ట్రేలియా జట్టులో మార్కస్ హారిస్ స్థానంలో ట్రావిస్ హెడ్ కు చోటు కల్పించారు.
ఇప్పటికే సిరీస్ ను 3-0 తేడాతో ఆస్ట్రేలియా గెల్చుకున్న సంగతి తెలిసిందే.