Reconsider on Strike: ఉద్యోగులను మోసం చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని, వారిని చర్చలకు పిలిచి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. ఉద్యోగులు ఏకపక్షంగా రాజకీయ పార్టీల్లాగా ఆలోచించవద్దని సూచించారు. కొంతమంది ఉద్యోగులు ఆవేశాలకు, విపక్షాల ప్రభావానికి గురై ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడవద్దని విజ్ఞప్తి చేశారు. తమది అందరి మంచి గురించి ఆలోచించే ప్రభుత్వమని, ఎన్ని ఇబ్బందులున్నా సిఎం జగన్ 27 శాతం ఐఆర్ ఇచ్చారని, అలాంటిది ఉద్యోగులకు ఎందుకు అన్యాయం చేస్తామని ప్రశ్నించారు. సచివాలయంలోని మీడియా సెంటర్ లో శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వ ఉద్యోగులను బానిసలుగా చూసి, కించపరిచిన సంఘటనలు గత ప్రభుత్వంలో చూశామని, బహిరంగ వేదికలపై ప్రభుత్వ ఉద్యోగులను అవమానించిన పరిస్థితి గతంలో ఉండేదని అయన గుర్తు చేశారు. కరోనాతో ఆర్థిక పరిస్థితులు దిగజారినా, ఉద్యోగులు అడగకపోయినా సీఎం 27శాతం ఐఆర్ ఇచ్చారన్నారు. ఐఆర్ ఇచ్చి ఉండక పోయి ఉంటే ప్రభుత్వంపై 18 వేల కోట్ల భారం పడి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. ఐఆర్ ఇవ్వకుండా ఉంటే పెండింగ్ లో ఉన్న చిన్న కాంట్రాక్టుల బిల్లులన్నింటినీ ప్రభుత్వం చెల్లించి ఉండేదని వ్యాఖ్యానించారు.
జగన్ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా చూస్తున్నారని, ఉద్యోగులను నష్టపరిచే ఉద్దేశం ప్రభుత్వానికి ఎంతమాత్రమూ లేదని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని, హెచ్ ఆర్ ఎ పై పునరాలోచన చేస్తుందని భరోసా ఇచ్చారు. పదివేల కోట్ల భారం పడుతున్నా ప్రభుత్వం 23శాతం ఫిట్ మెంట్ ఇచ్చిందని, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకీ ప్రభుత్వం వేతనాలు పెంచిందని, సమ్మె విషయంలో ఉద్యోగులు పునరాలోచన చేయాలని కోరారు. ప్రభుత్వం ఎప్పుడూ మొండిగా వ్యవహరించబోదని, ఉద్యోగులు అందరికీ న్యాయం జరుగుతుందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఉద్యోగులు పీఆర్సీ పై తెలంగాణతో పోల్చి చూసుకోవాలని హితవు పలికారు. పక్క రాష్ట్రాల్లో ఎక్కడా ఇంత పీఆర్సీ లేదన్నారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం పునరాలోచన చేస్తుందని, అయితే ఉద్యోగులు కూడా తమ వైపు నుంచే కాకుండా ప్రభుత్వం వైపు నుంచి కూడా ఆలోచన చేయాలన్నారు.
Also Read : చర్చలు జరపాలి: సోము డిమాండ్