Superstitions – Impact: భక్తి వేరు… మూఢ నమ్మకం వేరు. భక్తి ముదిరి మూఢనమ్మకమైతే.. ఆ మూఢభక్తి పర్యవసానాలేవైనాఉండొచ్చు… ఎంతదాకైనా వెళ్లొచ్చు. భక్తంటే ఏ రూపంలోనైనా ఉండొచ్చు. పరమ నాస్తికుడి నుంచీ ఆస్తికుల వరకూ భక్తులను చూడొచ్చు. ఏంటీ నాస్తికుడన్నవాడికి భక్తేంటన్న మీమాంస మళ్లీ కల్గొచ్చు! కానీ భక్తి ఎన్నో రకాలు. తల్లిదండ్రుల పట్ల చూపేది… గురుతుల్యల పట్ల చూపేది.. దేవుడి పట్ల కల్గి ఉండేది…ఇలా పలురకాలు. అయితే ఓ నాస్తికుడు దేవుణ్ని నమ్మకపోవచ్చు. కానీ, తన తల్లిదండ్రులు, గురువుల పట్ల భక్తిప్రపత్తులతో కూడిన విశ్వాసాన్ని కల్గి ఉండొచ్చు. ఓ హేతువాది దేవుడున్నాడనే వాదనను హేతుబద్ధంగా నిరూపించమనవచ్చు.. కానీ తాను నమ్మిన సిద్ధాంతాల పట్ల గౌరవపూర్వకమైన భక్తినీ కల్గి ఉండవచ్చు.
విశ్వాసం వేరు… భక్తి వేరు. అయితే అదే భక్తికీ, మూఢవిశ్వాసానికీ మధ్యా ఓ చిన్న విభజన రేఖ ఉంటుంది. అది గమనించకపోవడం వల్లే.. ఇప్పటికీ ఇంకా ఎన్నో అనర్థాలు ఈ సమాజాన్ని కలవరపెడుతూనే ఉన్నాయి. అందుకు రెండు రోజుల క్రితం జగిత్యాల జిల్లాలో కలకలం రేపిన ఓ ఘటన పరాకాష్ఠగా చెప్పుకోవాల్సి ఉంటుంది. క్షుద్రపూజలు చేస్తున్నారన్న నెపంతో ఓ కుల సంఘ సమావేశంలో తండ్రీ, ఇద్దరు కొడుకులను సుమారు 60 మంది చూస్తుండగా.. కత్తులు, బరిశెలతో పొడిచి చంపిన ఘటన.. కచ్చితంగా సంస్కారవంతమైన సమాజమని మనం జబ్బలు చర్చుకుంటున్నదానికి ఓ కంప్లీట్ కాంట్రాస్ట్ పిక్చర్… మూఢనమ్మకానికి నిలువెత్తు దృశ్యరూపం కూడాను!
పూజించడం భక్తైతే… క్షుద్రపూజ అనేది ఓ మూఢనమ్మకం. ఆ పని చేస్తున్నారన్న పేరుతో తెగనరుక్కోవడం పాశవికం. అయితే వీటినాపాల్సిన సమాజం ఏం చేస్తున్నట్టు…? చైతన్యవంతమైనదిగా మనకు మనం జబ్బలు చర్చుకునే సమాజమంటే నిత్యం అక్కడో ఇక్కడో ఇలాంటి ఘటనలు జరగుతున్నప్పుడు… అలాంటివాటికి అడ్డుకట్ట వేయాలన్న యోచన లేనిదేనా..? కుల బహిష్కరణలు, సాంఘిక బహిష్కరణలు, ఊరి బహిష్కరణలు, రెండు గ్లాసుల పద్ధతులు, చేతబడి, బాణామతి, క్షుద్రపూజలు, నరబలులు, గుప్తనిధుల పేరిట మానవ సంహారాలు… ఇవన్నీ వింటుంటే మానవ సమాజం ఎంతో కష్టపడి శాస్త్ర, విజ్ఞానంలో పదడుగులు ముందడుగేస్తోందని సంతోషించే లోపే… మూఢ నమ్మకాలు మనల్ని వందల అడుగుల అధఃపాతాళంలోకి తొక్కేస్తున్నాయన్న ఒకింత బాధ ఆ ఆనందాన్ని ఆవిరి చేసేదే!
మనం ఓవైపు కృత్రిమ మేథతో… ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నామని గొప్పలు పోతుంటాం.. రోదసీలోకి ప్రైవేట్ రాకెట్ లాంఛర్లలోనూ ఎగజిమ్ముతూ ఇతర గ్రహాల్లోనూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేసి అక్కడా నివాసాలేర్పాటు చేసుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచనలు చేస్తున్నాం… టైంమిషన్ లో గత కాలపు వైభవాలతో పాటు… రాబోయే తరాలనుభవించబోయే భవిష్యత్తూనూ చూసి చుట్టిరావాలని ఊహలకు రెక్కలు తొడిగి తహతహలాడుతుంటాం. అదే తెలివితో కులాల కుంపట్లలో, మతాల మౌఢ్యాల్లో తలదూర్చి… నచ్చనివారిని ఏకిపారేస్తాం.. మనకు మనం స్వయం ప్రకటిత మేధావులమని ప్రకటించుకుంటాం… కానీ, మన చుట్టూ ఉన్న అనాగరిక, ఆటవిక సమాజాన్ని ఇంకా మార్చలేని చేతగానితనాన్ని మాత్రం ఒప్పుకోం. ఎందుకంటే తనదైన రంగంలో తానెంత సమర్థవంతుడో, బలాఢ్యుడో చెప్పుకునేందుకిష్టపడినంతగా.. తన బలహీనతలని ఒప్పుకోని సర్వసాధారణమైన తత్వం మనిషిది గనుక!
క్షుద్రపూజలు, బాణామతులు, నరబలుల పేరిట ఇలాంటి వార్తలు పునరావృతంగా చూడాల్సి రావడం సమ సమాజం మొత్తానికే సిగ్గుచేటు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు, పోలీస్ శాఖ అవగాహన కల్పిస్తున్నాయే తప్ప… సమాజం మొత్తంలో ఇలాంటి ఘటనలే లేకుండా సంకల్పశుద్ధితో చేసే కార్యక్రమాలు ప్రగతి దిశలో పయనించే సమాజంలో ఇంకా ఇంకా కానరాకపోవడం మాత్రం ముమ్మాటికీ దురదృష్టకరమే!
-రమణ కొంటికర్ల
Also Read : యువరైతు ఆత్మాభిమానం