Saturday, November 23, 2024
HomeTrending Newsవిభజన హామీల సాధనే అజెండా

విభజన హామీల సాధనే అజెండా

టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం ప్రగతిభవన్ లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. ఈ సందర్భంగా పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాల్లో అనుస‌రించాల్సిన వ్యూహంపై కేసీఆర్ ఎంపీల‌కు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి చెందిన అంశాల‌పై ఎంపీల‌తో ముఖ్యమంత్రి చ‌ర్చించారు. కేంద్రం నుంచి సాధించాల్సిన పెండింగ్ అంశాల‌పై కేసీఆర్ పలు సూచనలు చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన అంశాల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం నివేదిక రూపొందించింది.. ఈ సందర్భంగా దానిని సీఎం కేసీఆర్ ఎంపీల‌కు అంద‌జేశారు. రాష్ట్ర హ‌క్కులు, ప్ర‌యోజ‌నాల కోసం కృషి చేయాల‌ని ఆయన ఆదేశించారు. పార్ల‌మెంట్‌లో తెలంగాణ వాణి బ‌లంగా వినిపించాల‌ని ఎంపీల‌కు కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం పార్ల‌మెంట్‌లో గ‌ట్టిగా పోరాడాలని… తెలంగాణ‌కు కేంద్రం చేసిందేమీ లేదని తెలిపారు. చ‌ట్ట‌ప‌రంగా, న్యాయ‌ప‌రంగా రావాల్సిన‌వి కూడా రాలేదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసిన తర్వాత ఎంపీ రంజిత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర బ‌డ్జెట్ చూసిన త‌ర్వాత దానికి అనుగుణంగా తాము స్పందిస్తామన్నారు. కేంద్రం దృష్టికి సీఎం ఇప్ప‌టికే ప‌లు అంశాలు తీసుకెళ్లారని రంజిత్ రెడ్డి తెలిపారు. 23 అంశాల‌తో కూడిన నివేదిక‌ను సీఎం ఎంపీలకు ఇచ్చారని… విభ‌జ‌న చ‌ట్టంలోని హామీల‌పై ఎక్కువ‌గా దృష్టి సారిస్తామని రంజిత్ రెడ్డి వెల్ల‌డించారు.

ఈ సమావేశంలో రాజ్యసభలో టీఆర్ఎస్ పార్టీ పక్షనేత కె.కేశవరావు, లోక్ సభ లో టీఆర్ఎస్ పార్టీ పక్షనేత నామా నాగేశ్వర రావు, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మికాంత రావు, కె.ఆర్.సురేష్ రెడ్డి, జోగినిపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, లోక్ సభ సభ్యులు బి.బి.పాటిల్, పి.రాములు, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, వెంకటేశ్ నేత, మాలోత్ కవిత,  కొత్త ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్