Troika Meeting : ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలనను గుర్తించే అంశంపై కీలక సమావేశం ఈ నెలాఖరులో కాబుల్ లో జరుగనుంది. త్రోయిక ప్లస్ దేశాల సమావేశం ఈ నెలాఖరులో కాబూల్ లో ఉంటుందని, ఖచ్చితమైన తేది తొందరలోనే ప్రకటిస్తామని ఆఫ్ఘనిస్తాన్ లో రష్యా ప్రత్యేక ప్రతినిధి జమిర్ కబులోవ్ ఈ రోజు కాబుల్ లో ప్రకటించారు. ఆఫ్ఘనిస్తాన్లో శాంతి,సుస్థిరత నెలకొల్పేందుకు రష్యా ప్రాదాన్యత ఇస్తోందని కబులోవ్ వెల్లడించారు. తాలిబన్లు ఆధికారంలోకి వచ్చాక దేశ పరిపాలన రంగంతో పాటు అన్ని వ్యవస్థల్లో అస్థిరత నెలకొందని, వాటన్నింటిని చక్కబరిచి గాడిలో పెడితేనే ఆఫ్ఘనిస్తాన్ మనుగడ సాధ్యమని ఆయన అన్నారు.
అమెరికా, రష్యా, చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లు త్రోయిక దేశాలుగా వ్యవహరిస్తున్నాయి. గత ఏడాది నవంబర్ లో త్రోయిక దేశాల సమావేశం ఇస్లామాబాద్ లో పాకిస్తాన్ నిర్వహించింది. ఆఫ్ఘన్ వ్యవహారాలపై నాడు సుదీర్గంగా చర్చించిన దేశాలు తాలిబాన్ల విషయంలో వేచి చూసే ధోరణి అవలంభించాలని నిర్ణయించాయి. చైనా, పాకిస్తాన్ దేశాలు తాలిబన్లకు మద్దతుగా వాదించినా అమెరికా, రష్యా లు కొన్ని అనుమానాలు వ్యక్తం చేశాయి. మైనారిటీలకు రక్షణ, మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు, పరమత సహనం, మానవ హక్కులు తదితర అంశాల్ని ప్రధానంగా ప్రస్తావించాయి.
ఆఫ్ఘన్లో రేపటి నుంచి అన్ని విద్యాసంస్థలు ప్రారంభం అవుతున్నాయి. చలి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఏప్రిల్ నుంచి విద్యాసంస్థలు ప్రారంభం అవుతాయి. విద్యాసంస్థల ప్రారంభంపై అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నా బాలిక విద్యపై ఆంక్షలను వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా ఏడో తరగతి నుంచి విశ్వవిద్యాలయాల వరకు విద్యార్థినులను అనుమతించకపోవటం అంతర్జాతీయ స్తాయిలో విమర్శలకు దారితీస్తోంది. బాలికలు, మహిళల విషయంలో వివక్ష త్రోయిక సమావేశంలో ప్రాధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.