We Support: ఉద్యోగుల ఆందోళన పట్ల ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తోందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు రోడ్లపైకి వస్తే పోలీసులను ఉసిగొల్పి వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడం దారుణమన్నారు. ఈ మేరకు లోకేష్ ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. ఓ పక్క ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని చెబుతూనే మరోవైపు సలహాదారుల ప్రకటనలు, పోలీసుల చర్యలు, విష ప్రచారాలతో, దాడులతో మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
“ఉద్యోగుల పట్ల ఎందుకింత క్రూరంగా వ్యవహరిస్తున్నారు? తమకు న్యాయబద్ధంగా రావాల్సిన ప్రయోజనాల విషయంలో మాట తప్పిన మీ ప్రభుత్వంపై ఉద్యోగులు నిరసన తెలపడం నేరం ఎలా అవుతుంది? ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం ప్రసాదించిన హక్కుని హరించే అధికారం మీకెవరిచ్చారు? విద్యాబుద్ధులు నేర్పే గురువులను పోలీసులతో నిర్బంధించడమేనా వారికి మీరిచ్చే గౌరవం? మీ అరాచక పాలనలో ఎలాంటి గౌరవానికి నోచుకోకపోయినా, ప్రభుత్వం కోసం కుటుంబాల్ని వదిలి మరీ పని చేస్తున్న ప్రభుత్వం ఉద్యోగులంటే ఎందుకంత కక్ష?” అంటూ లోకేష్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఉద్యోగుల శాంతియుత, న్యాయమైన ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు లోకేష్ ప్రకటించారు.
Also Read : అర్ధం చేసుకోండి: ఉద్యోగులకు మంత్రుల విజ్ఞప్తి