Mamata Banerjee In Support Of Akhilesh Yadav:
తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఉత్తరప్రదేశ్ లో అఖిలేశ్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీకి మద్దతుగా రంగంలోకి దిగారు. దీనికోసం రెండు రోజుల యూపీ పర్యటనలో భాగంగా ఆమె యూపీలో బీజేపీపై నిప్పులు చెరిగింది. మంగళ వారం లక్నోలో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న దీదీ ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు.
హథ్రాస్, ఉన్నావ్ ఘటనలకు బాధ్యులైన వారిని చరిత్ర ఎప్పటికీ క్షమించదని, కరోనా తాండవిస్తున్న కాలంలో గంగా నదీ తీరంలో మృతదేహాలను గుమ్మరించిన వారిని చరిత్ర క్షమించదని మమతా బెనర్జీ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. ఇంతటి దారుణ ఘటనలు జరిగినప్పుడు ఎక్కడ ఉన్నారు యోగీ జీ? ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు యోగి ఆదిత్యానాథ్ కచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందే అని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలను కోరేది ఒక్కటే సమాజ్‌వాదీ పార్టీని గెలిపించండి. బీజేపీని ఓడించండి. బీజేపీ బూటకపు హామీలను విశ్వసించకండని ఆమె అఖిలేశ్ యాదవ్ పార్టీకి మద్దతు ఇచ్చారు. మార్చి 3వ తేదీన తాను వారణాసి కూడా పర్యటించనున్నట్టు వెల్లడించారు.
ఆ తర్వాత మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్‌లు కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అఖిలేశ్ యాదవ్ బీజేపీపై విమర్శలు కురిపించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దాని బలాన్ని మొత్తం ప్రయోగించిందన్నారు. దీదీని ఓడించలేక ఢీలా పడిపోయారన్నారు. దీదీ కోల్‌కతా నుంచి లక్నోకు వచ్చారని, బీజేపీ మాత్రం ‘బ్యాడ్ వెదర్’ కారణంగా ఢిల్లీ నుంచి యూపీకి రాలేకపోయిందని విమర్శించారు. అబద్ధాలతో నిండిన బీజేపీ విమానం ఈసారి ఉత్తరప్రదేశ్‌లో ల్యాండ్ కాలేకపోయిందన్నారు.