Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ లో నేడు జరిగిన మూడు మ్యాచ్ ల్లో పూణేపై బెంగాల్; తెలుగు టైటాన్స్ పై ఢిల్లీ, తలైవాస్ పై గుజరాత్ విజయం సాధించాయి.
బెంగాల్ వారియర్స్ – పునేరి పల్టాన్ జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్ లో 43-36 తో బెంగాల్ విజయం సాధించింది. ఆట ప్రథమార్థంలో 20-10తో వెనకబడిన బెంగాల్ ద్వితీయార్థంలో ఆటపై పట్టుబిగించి 33-16తో ధీటుగా బదులిచ్చింది. మ్యాచ్ ముగిసే నాటికి 7 పాయింట్ల తేడాతో గెలుపు సొంతం చేసుకుంది. పూణే జైపూర్ రైడర్ మొహిత్ గయత్ -15, బెంగాల్ ఆటగాడు మణీందర్ సింగ్ 11 పాయింట్లతో సత్తా చాటారు.
దబాంగ్ ఢిల్లీ – తెలుగు టైటాన్స్ జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్ లో 40-32తో ఢిల్లీ నెగ్గింది. ఆట మొదటి సగ భాగంలో 19-14 తో ఢిల్లీ ఆధిక్యం ప్రదర్శించింది. రెండో భాగంలో తెలుగు టైటాన్స్ పుంజుకుని ఆడినా చివరకు 21-18తో ఢిల్లీ దే పైచేయి అయ్యింది. దీనితో మ్యాచ్ సమయం ముగిసే నాటికి 8 పాయింట్ల తేడాతో Delhi విజయం సాధించింది. టైటాన్స్ రైడర్ అంకిత్ బెణీవాల్ 10 పాయింట్లతో రాణించాడు.
గుజరాత్ జెయింట్స్– తమిళ్ తలైవాస్ జట్ల మధ్య జరిగిన మూడో మ్యాచ్ లో 43-33తో గుజరాత్ విజయం సాధించింది. ఆట ప్రథమార్ధంలో 16-13తో స్వల్ప ఆధిక్యం సంపాదించిన గుజరాత్ ద్వితీయార్ధంలో 27-20తో ముందంజలో నిలిచింది. దీనితో మ్యాచ్ ముగిసే సమయానికి 10 పాయింట్ల ఆధిక్యంతో గెలుపు సొంతం చేసుకుంది. గుజరాత్ ఆటగాడు గజేంద్ర రాజ్ పుత్ 10 పాయింట్లు సాధించాడు.
నేటి మ్యాచ్ లు పూర్తయిన తరువాత… పాట్నా పైరేట్స్ (81 పాయింట్లు); దబాంగ్ ఢిల్లీ (75); యూపీ యోధ (68); బెంగుళూరు బుల్స్ (66); హర్యానా స్టీలర్స్ (63); జైపూర్ పింక్ పాంథర్స్ (62) టాప్ సిక్స్ లో ఉన్నాయి.