భారత్ – చైనా దేశాల మధ్య నెలకొన్న సమస్యల విషయంలో ఇతరులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ లు దూరదృష్టి ఉన్న, బాధ్యతాయుతమైన నాయకులని, వారిలో ఒకరిపై ఒకరికి గౌరవాభిమానాలు ఉన్నాయని పుతిన్ అభిప్రాయపడ్డారు. సెయింట్ పీటర్ బర్గ్స్ లో అంతర్జాతీయ ఎకనమిక్ ఫోరంలో ప్రపచంలోని వివిధ దేశాలకు చెందిన న్యూస్ ఏజెన్సీల అధిపతులతో పుతిన్ మాట్లాడారు. రెండు దేశాల మధ్య తలెత్తిన వివాదాలను, అంశాలను వారిలో వారు పరిష్కరించు కుంటారని, మూడో వారి జోక్యం అనవసరమని అన్నారు.
తూర్పు లడక్ ప్రాంతంలో తలెత్తిన సరిహద్దు సమస్య రెండు దేశాల సంబంధాలను దెబ్బతీసింది. పలుమార్లు ఇరు దేశాల సైనికుల మధ్య కాల్పులు కూడా జరిగాయి, చైనా దళాలను మన జవాన్లు సమర్ధవంతంగా ఎదుర్కొని నిలువరించగలిగారు. ఉద్రిక్తతల పరిష్కారానికి కమాండర్ల స్థాయిలో కనీసం 10 సార్లు చర్చలు జరిగాయి.
సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ జరిగితేనే శాంతి నెలకొంటుందని, ప్రశాంత వాతావరణం ఏర్పడుతుందని, అప్పుడే రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతాయని భారత విదేశాంగ శాఖ అభిప్రాయపడింది.