Answer to CAG: ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తున్న డబ్బును ఇష్టానుసారం ఖర్చు పెట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆర్ధిక అరాచకం రాజ్యమేలుతోందని, 151 సీట్లు వచ్చాయి కాబట్టి రాజ్యంగంతో తమకు పనిలేదన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ మూడేళ్ళ పాలనలో దాదాపు లక్ష కోట్ల రూపాయలు బడ్జెట్ తో సంబంధం లేకుండా ఖర్చు పెట్టినట్లు కాగ్ వెల్లడిస్తే, అది తనకు సంబంధం లేని విషయమన్నట్లు ప్రభుత్వ తీరు ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక అవకతవకలపై ప్రతిపక్షంగా తాము ప్రశ్నిస్తే సంక్షేమాన్ని అడ్డుకుంటున్నట్లు ప్రచారం చేస్తున్నారని, అయితే ఇప్పడు కాగ్ స్వయంగా ఈ విషయంలో జగన్ ప్రభుత్వాన్ని తప్పుబట్టిందని అశోక్ బాబు వివరించారు.
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై సామాన్య ప్రజలు కూడా ఆలోచించాలని, పన్నులు కట్టే ప్రతి ఒక్కరూ గమనించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నేలా 7.5 శాతం వడ్డీతో బండ్లను కొనుగోలు చేస్తోందని, ఈ అప్పులు రాష్ట్రానికి ఉపయోగపడడం లేదని, ఓవర్ డ్రాఫ్ట్ కింద ఆర్బీఐ జమ చేసుకుంటోందని పేర్కొన్నారు.
ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించలేదని, వారి ఆందోళనలను అణగదొక్కిందని అశోక్ బాబు వ్యాఖ్యానించారు. కోవిడ్ నివారణకు రాష్ట్రం 30 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉద్యోగ సంఘాల నేతలకు ఇచ్చిన నివేదికలో పేర్కొంటే, సిఎం జగన్ ప్రధానికి ఇచ్చిన వినతి పత్రంలో 8 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పారని.. ఈ రెంటిలో ఏది నిజమో చెప్పాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు. పయ్యావుల కేశవ్ చైర్మన్ గా ఉన్న పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశాలకు అధికారులు హాజరు కావడంలేదన్నారు. అసలు బడ్జెట్ కు విలువే లేకుండా పోయిందన్నారు.