Telangana Budget Session :
మార్చి 7 తేదీ (సోమవారం) నుంచి రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. కాగా., రాష్ట్ర బడ్జెట్ కు ఆమోదం తెల్పేందుకు మార్చి 6 వ తేదీ (ఆదివారం) సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. మార్చి 7 వ తేదీన ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ను ప్రవేశపెడతారు. సభ ఎన్నిరోజులు జరగాలనేది బిఎసి సమావేశంలో నిర్ణయిస్తారు.
రాష్ట్ర శాసన సభ, శాసన మండలి బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీల ఖరారు కోసం., ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రగతి భవన్ లో ఈ రోజు సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో… పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి కెటిఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, శాసన సభా వ్యవహారాల శాఖమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు, సిఎం కార్యదర్శులు స్మితా సబర్వాల్, రాజశేఖర్ రెడ్డి, అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచారి తదితరులు పాల్గొన్నారు.
గవర్నర్ ప్రసంగం లేకుండానే ఈ దఫా బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. గతంలో ఉమ్మడి ఏపిలో 1970, 2004 లోనూ గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ లో బడ్జెట్ సమర్పణ జరిగింది.