కచ్చా బాదామ్ సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసింది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ రీల్స్ విపరీతంగా ఆదించారు.. ఇంకా ఆదరిస్తున్నారు జనాలు. పచ్చి పల్లీలు అమ్ముకునే ఓ వీధివ్యాపారి.. ఊరూరా తిరుగుతూ అరిచిన అరుపులనే పాటగా మలిచి క్రేజీనెస్ తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఆ పల్లీల వ్యాపారి జీవితమే మారిపోయింది. అయితే.. తాజాగా ఈ వైరల్ సెన్సేషన్ సింగర్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు.
‘పాత సామాన్లు ఇచ్చి.. పచ్చి పల్లీలు తీసుకెళ్లండంటూ’ గల్లీలో తిరుగుతూ తనదైన శైలిలో పాడుతూ జనాల్ని ఆకట్టుకునేవాడు పశ్చిమ బెంగాల్ కు చెందిన భూబన్ బద్యాకర్. కచ్చా బాదామ్ పాటకు క్రేజ్తో పాటు ఆయన అవతారమే పూర్తిగా మారిపోయింది. ఈ క్రమంలో దక్కిన కొద్దిపాటి రెమ్యునరేషన్తో సెకండ్ హ్యాండ్ కారు కూడా కొనుక్కున్నాడు. సోమవారం స్వయంగా తానే కారును నేర్చుకునే క్రమంలో యాక్సిడెంటు గురయ్యాడు అతను. ఛాతీలో బలమైన గాయం కావడంతో కుటుంబీకులు అతన్ని ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం భూబన్ పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం.
ఇక ‘కచ్చా బాదామ్’ భూబన్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. పశ్చిమ బెంగాల్లోని లక్ష్మీనారాయణపూర్ కురల్జురీ గ్రామం.. భూబన్ స్వస్థలం. భార్యతో పాటు ముగ్గురు పిల్లల తండైన భూబన్.. పచ్చి పల్లీలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. పాత సామాన్లు, పగిలిపోయిన వస్తువులకు బదులు పల్లీలు ఇస్తూ.. వాటిని జంక్ షాపుల్లో అమ్మి ఆ వచ్చే 200, 300 వందల రూపాయలతో జీవనం కొనసాగించేవాడు. ఆ తర్వాత యూట్యూబ్ ఛానెల్స్, ఇన్స్టా రీల్స్తో కచ్చా బాదామ్ ఫేమస్ అయ్యింది. మొదట్లో సాంగ్ వైరల్ అయినప్పుడు.. తనకు క్రెడిట్ దక్కలేదని గోల చేసిన భూబన్, తీరా అది దక్కాక పూర్తిగా మారిపోయాడు.
ఇకపై పల్లీలు అమ్ముకోనని, సింగింగ్ కెరీర్లోనే కొనసాగుతానని, ఈ క్రేజ్ కారణంగా తనను కిడ్నాప్ చేస్తారేమోనని భయంగా ఉందంటూ భూబన్ పోలీసులను సైతం ఆశ్రయించాడు. ఆ బిల్డప్ చూసి అప్పటిదాకా అతన్ని మెచ్చుకున్న వాళ్లే.. తిట్టకున్నారు కూడా. తాజాగా కోల్కతాలోని ఓ పోష్ క్లబ్లో అతగాడు రాక్టార్ అవతారంలో ప్రదర్శన కూడా ఇవ్వడం చూసి ముక్కున వేలేసుకున్నారు చాలామంది.