Develop Amaravathi: మూడు రాజధానులు, సిఆర్డీయే రద్దుపై ఏపీ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ఈ తీర్పు మొదటినుంచీ ఊహించిందే నన్నారు. గతంలో తమ ప్రభుత్వం రాజ్యంగపరంగా, ఉభయ సభల్లో ఆమోదించిన రాజధాని, సిఆర్డీయే బిల్లును అమలు చేయడం తప్ప మరో మార్గం లేదని, అయితే ఈ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో మూడేళ్ళపాటు కాలయాపన చేసిందని యనమల ఆరోపించారు. దీనివల్ల రాష్ట్రం చాలా నష్టపోవాల్సి వచ్చిందని, లేకపోయి ఉంటే ఇప్పటికే అమరావతి పూర్తయి ఉండేదన్నారు. నిన్న కూడా పార్లమెంట్ లో అమరావతి పేరిటే నిధులు కేటాయించారని గుర్తు చేశారు.
ఇప్పటికైనా ప్రభుత్వం అప్పీల్ కు వెళ్ళకుండా, రాజధాని నిర్మాణం, దాని చుట్టూ తమ ప్రభుత్వం నాడు ప్రతిపాదించిన అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు. సచివాలయ భవనాలు, అధికారులు, ఉద్యోగుల నివాస భవనాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస గృహాల నిర్మాణంపై దృష్టి సారించాలని హితవు పలికారు. మూడు రాజధానుల బిల్లు చెల్లదనే విషయాన్ని తాము మొదటినుంచీ చెబుతూనే ఉన్నామని, కానీ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని, రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించిందని విమర్శించారు.
Also Read : సిఆర్డీయే రద్దు చెల్లదు: హైకోర్టు ఆదేశం