We attend: అమరావతి, పోలవరం, ప్రత్యేకహోదా, నిరుద్యోగులు, నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ కోతలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్ సమస్యలను అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తుతామని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు, టిడిఎల్పీ ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అద్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శాసనసభ పక్ష సమావేశం జరిగింది. సోమవారం జరగనున్న శాసనసభ, శాసనమండలి సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ … టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాతే ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానని చంద్రబాబు చెప్పిన మాటకు కట్టుబడి అయన హాజరు కావడంలేదని, మిగిలిన వారంతా హాజరవుతామని వివరించారు. ప్రతిపక్షాన్ని అసెంబ్లీలో అణచివేసేందుకు అనేక ప్రయత్నాలు చేసినా ప్రజా సమస్యల మీద చర్చించేందుకు సిద్దమయ్యామన్నారు.
40 ఏళ్లుగా టీడీపీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రధానమైన భూమికను పోషిస్తున్నమని అచ్చెన్న గుర్తు చేశారు. తాము అసెంబ్లీ నుంచి పారిపోతున్నామన్న ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యాలను అయన ఖండించారు. గతంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ కనీసం చెప్పకుండా శాసనసభ నుంచి పారిపోయిన విషయం గుర్తుంచుకోవాలని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే ముందు ఎమ్మెల్యేలకు తెలియజేసి తీసుకోవడం సంప్రదాయంగా వస్తోందని కానీ గత మూడేళ్ళుగా ఈ ప్రభుత్వం తీసుకున్న రాజధాని బిల్లుల ఉపసంహరణ, రాజధాని కొత్త బిల్లు తీసుకువచ్చినప్పుడు సడన్ గా శాసనసభలో చూసి చాలా మంది అధికార పార్టీ సభ్యులే విస్మయం చెందారని అచ్చెన్నాయుడు అన్నారు. తాము శాసనసభకు వస్తామని ప్రజా సమస్యలను లేవనెత్తుతామని స్పష్టం చేశారు.