Thursday, March 28, 2024
HomeTrending Newsఇది సరికాదు: గవర్నర్ తమిళి సై

ఇది సరికాదు: గవర్నర్ తమిళి సై

it is tradition: గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వ విజ్ఞతకే వదిలేస్తున్నానని గవర్నర తమిళిసై సౌందర రాజన్ స్పష్టం చేశారు. గత అసెంబ్లీ సమావేశాలకు  కొనసాగింపుగానే ఈ బడ్జెట్ సెషన్స్ ఉంటాయన్న ప్రభుత్వ వాదనను ఆమె తప్పు బట్టారు. ఐదు నెలల తరువాత సమావేశం అవుతూ పాత సెషన్స్ కు ఇది కొనసాగింపు అని చెప్పడం సహేతుకం కాదన్నారు. ఈ మేరకు ఆమె ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు.

గవర్నర్ ప్రసంగం లేకుండానే సెషన్స్ జరుపుతున్న విషయాన్ని ప్రజలు గమనించాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు. కానీ సంప్రదాయాన్ని విస్మరిస్తూ దానికి వింత వాదనలు లేవనెత్తడం, సాంకేతిక కారణాలతోనే గవర్నర్ ప్రసంగం లేదని చెప్పడం సరికాదన్నారు. గవర్నర్ ప్రసంగం అనేది ప్రభుత్వం తరఫున చేసే ప్రకటన గానే ఉంటుంది కానీ సొంత ప్రసంగం కాదని చురకలు వేశారు. సంవత్సర కాలంగా ప్రభుత్వ ప్రగతి నివేదికను ఈ ప్రసంగం ద్వారా సభకు, తద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తారని వ్యాఖ్యానించారు.

ప్రజలచే ఎన్నుకోబడిన చట్టసభల ప్రతినిధులను ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలకు బాధ్యులుగా ఉండేలా చేయడంలో గవర్నర్ ప్రసంగం ఓ ముఖ్య పరికరంగా పనిచేస్తుందని ఆమె గుర్తు చేశారు.  ఆర్ధిక బిల్లును తన ఆమోదానికి పంపినప్పుడు గవర్నర్ ప్రసంగం ఉంటుందని చెప్పిన ప్రభుత్వం ఆ తర్వాత పొరపాటున అలా చెప్పమని వివరణ ఇవ్వడం పధ్ధతి కాదని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు.  ఏది ఏమైనా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యం విలువలను, సంప్రదాయాలను గౌరవించేందుకు, సహకార స్ఫూర్తిని పెంచేందుకు తాను ఆర్ధిక బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇచ్చానని తెలిపారు.

రాష్ట్ర ప్రజలకు తమిళి సై శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగం గవర్నర్ కు కొన్ని స్పష్టమైన అధికారాలు ఇచ్చినా, గవర్నర్ ప్రసంగం లేదని ప్రభుత్వం చెప్పినా, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే తాను ఆర్ధిక బిల్లును ఆమోదించి పంపానని, బడ్జెట్ సమర్పించేందుకు అనుమతి మంజూరు చేశానని గవర్నర్ వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్