Saturday, November 23, 2024
HomeTrending Newsఉత్తరప్రదేశ్లో చివరి దశ పోలింగ్ ప్రశాంతం

ఉత్తరప్రదేశ్లో చివరి దశ పోలింగ్ ప్రశాంతం

దేశం యావత్తు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ చివరి అంకానికి చేరుకుంది. మొత్తం ఏడు దశల్లో పోలింగ్ నిర్వహిస్తుండగా చివరి దశ పోలింగ్‌ కొద్ది సేపటి క్రితం ముగిసింది. సాయంత్రం అయిదు గంటల వరకు సుమారు 54.18 శాతం పోలింగ్ నమోదైంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల చివరి విడత పోలింగ్ ఈ రోజు (సోమవారం) ఉదయం 7 గంటలకు ప్రారంభం అయింది. 9 జిల్లాల్లోని 54 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరిగింది. 54 సీట్లలో మొత్తం 613 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. చందోలీ, ఘాజీపూర్, మౌ, అజంగఢ్, మీర్జాపూర్, భదోహి, జౌన్‌పూర్, సోన్‌భద్ర, వారణాసి జిల్లాల పరిధిలో 2కోట్ల 6లక్షల మంది ఓటర్లు నేతల భవితవ్యాన్ని తేల్చనున్నారు.

ఈ దశలో రాష్ట్ర మంత్రులు నీలకంఠ తివారీ (వారణాసి దక్షిణ), అనిల్‌ రాజ్‌భర్‌ (శివ్‌పుర్‌-వారణాసి), రవీంద్ర జయస్వాల్‌ (వారణాసి ఉత్తర), గిరీశ్‌ యాదవ్‌ (జౌన్‌పుర్‌), రామశంకర్‌సింగ్‌ పటేల్‌ (మడిహాన్‌-మిర్జాపుర్‌)లతో పాటు ఇటీవలే మంత్రి పదవికి రాజీనామా చేసి ఎస్పీలో చేరిన దారాసింగ్‌ చౌహాన్‌ (ఘోసీ), సుహెల్దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ అధ్యక్షుడు ఓంప్రకాశ్‌ రాజ్‌భర్‌ (జహూరాబాద్‌) తదితర ప్రముఖులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. చివరి దశ పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా  60,000 మంది పోలీసులు, 845 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించారు. మార్చి 10వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు రాష్ట్రాల ముఖ్యమంత్రులనే కాదు.. ఈ ఏడాదిలో జరిగే రాష్ట్రపతి ఎన్నికలోనూ కీలక పాత్ర పోషించనున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీ కాలం జులై 24తో ముగియనుంది. ఇప్పటికైతే బీజేపీ అభ్యర్థిని రాష్ట్రపతిగా ఎన్నుకోడానికి అధికార పార్టీకి ఎలాంటి ఇబ్బందీ లేనప్పటికీ.. యూపీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తే ఆ పార్టీకి కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. దీంతో టీఆర్ఎస్, వైసీపీ, బిజూ జనతా దళ్‌ (బీజేడీ) రాష్ట్రపతి ఎన్నికలో కీలకం కానున్నాయి.

Also Read : యుపీలో ఆరో విడత పోలింగ్ ప్రారంభం

RELATED ARTICLES

Most Popular

న్యూస్