with Public: రెండేళ్లలో ఎన్నికలు ఉన్నందున మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలంతా క్షేత్రస్థాయిలోనే ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. ఏపీ మంత్రివర్గ సమావేశం సీఎం అధ్యక్షతన జరిగింది. దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతి పట్ల ఏపీ కేబినెట్ సంతాపం తెలిపింది. మెయిన్ అజెండా పూర్తయిన తర్వాతా కాసేపు రాజకీయ అంశాలపై చర్చ జరిగింది, ఈ సందర్భంగా మంత్రులకు జగన్ దిశానిర్దేశం చేశారు. త్వరలోనే పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని చెప్పరు. మూడేళ్ళ పరిపాలనలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేశామని, చెప్పని వాగ్దానాలను కూడా ఎన్నో నెరవేర్చామని జగన్ వ్యాఖ్యానించారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ పారదర్శకంగా అందిస్తున్నామని, దీనిపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరగాలన్నారు.
కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు:
⦿ రాష్ట్రంలో ఉర్దూ భాషను రెండో భాషగా గుర్తించేందుకు వీలుగా ఏపీ అధికార భాషా చట్టం 1966కు సవరణ చేయాలని కేబినేట్ తీర్మానించింది.
⦿ ఉద్యోగుల పదవి విరమణ వయసును 62 సంవత్సరాలకు పెంచే నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
⦿ జిల్లాల విభజనకు సంబంధించి వచ్చిన అభ్యంతరాలపై మంత్రివర్గం చర్చించింది.
⦿ వీటితో పాటు నిజాంపట్నం, మచిలీపట్నం,ఉప్పాల ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది,
⦿ మచిలీపట్నం,భావనపాడు, రామాయపట్నం పోర్టుల నిర్మాణం కోసం రూ.8,741కోట్ల రుణ సమీకరణకు ఏపీ మారిటైం బోర్డుకు హామీ ఇచ్చేందుకూ అంగీకరించింది.
⦿ మడకశిర బ్రాంచ్ కెనాల్ పనులకు రూ.214 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ తీర్మానించింది.
⦿ విదేశీ మద్యం నియంత్రణ చట్టానికి సవరణ చేయాలని కేబినెట్ తీర్మానించింది.
⦿ కర్నూలుకు చెందిన ఇండియన్ డెఫ్ టెన్నిస్ కెప్టెన్, 2017 డెఫ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత షేక్ జాఫ్రిన్‌కు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.
⦿ ఆర్చరీ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత కుమారి జ్యోతి సురేఖ వెన్నంకు డిప్యూటీ కలెక్టర్ నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం
⦿ తిరుమల తిరుపతి దేవస్ధానం ప్రత్యేక ఆహ్వానితులపై అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లుకు కేబినెట్ ఆమోదం