ఉక్రెయిన్ వైపు నుంచి యుద్ధం ఆపే ప్రసక్తే లేదని ఆ దేశ అధ్యక్షుడు వోలోద్మిర్ జేలేన్సకీ ప్రకటించారు. ఈ రోజు ఉక్రెయిన్ దగ్గర జరుగుతున్న యుద్ధం తొందరలోనే ప్రపంచాన్ని చుట్టుముట్టుతుందని హెచ్చరించారు. ఇప్పుడు జరిగే యుద్ధం పశ్చిమ దేశాలను తాకి తీరుతుందన్నారు. అమెరికా, కెనడా తదితర దేశాలు యుద్ధం జరుగుతున్న ప్రాంతానికి తాము చాలా దూరంలో ఉన్నామని భావిస్తున్నారని, మొదట మేము బలయ్యామని ఆ తర్వాత మరొకరి వంతు వస్తుందని జేలేన్సకీ స్పష్టం చేశారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రక్తం మరిగిన మానవ మృగంగా మారి ఉక్రెయిన్ లో అమాయకులను పొట్టన పెట్టుకుంటున్నాడని జేలేన్సకీ ఆవేదన వ్యక్తం చేశారు. పుతిన్ అనే మృగం మొదట ఉక్రెయిన్ ప్రజలను బలిగొని ఆ తర్వాత మిగతా ప్రపంచం మీద పడి తీరుతుందని అన్నారు. ఉక్రెయిన్ లో మనవ హక్కుల పరిరక్షణకు పాశ్చాత్య దేశాలు ముందుకు రాకపోతే తగిన ఫలితం అనుభవించి తీరుతారని పరోక్షంగా నాటో దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. ఈ యుద్దాన్ని ఆపే శక్తి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కు ఉందని జేలేన్సకీ తెలిపారు.
ఉక్రెయిన్ గగనతలాన్ని నో ఫ్లై జోన్ గా ప్రకటించేందుకు నాటో సమ్మతించక పోవటం దారుణమని, నాటో దేశాలు ఇదే తీరుగా వ్యవహరిస్తే తొందరలోనే యూరోప్ ను యుద్ధం ఆవహిస్తుందని జేలేన్సకీ అన్నారు. మరోవైపు జహితోమిర్ , చేర్న్యఖివ్ ప్రాంతాల్లో భారీ ఆయిల్ డిపోలను రష్యా వైమానిక దళాలు పెల్చేశాయి. ఈ ఘటనలో సుమారు 20 మంది పౌరులు మృతి చెందారని ఉక్రెయిన్ ప్రకటించింది.