కరోనా క్రైసిస్ ఛారిటిని మొదలెట్టి గత ఏడాది కరోనా సమయంలో సినిమా కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణి చేసిన విషయం తెలిసిందే. ఈ సారి కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పుడు సినిమా కార్మికులకు వాక్సిన్ వేయించే కార్యక్రమం సోమవారం ఉదయం చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ శంకర్, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, సెక్రెటరీ దొరై లతో పాటు పలువురు సినీ టెక్నీషియన్స్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ.. కరోనా క్రైసిస్ చారిటి కింద ఈ రోజు సినిమా వర్కర్స్ 24 క్రాఫ్ట్స్ వారికీ, ఫిలిం ఫెడరేషన్ వారందరికీ, అలాగే వారితో పాటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్నీ కూడా ఇందులో చేర్చడం జరిగింది. అలాగే జర్నలిస్ట్ లకు కూడా వాక్సిన్ ఇస్తున్నాం. ఈరోజు ఈ సిసిసి తలపెట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్ పునః ప్రారంభించాం. ఈ కార్యక్రమానికి చిరంజీవి చారిటబుల్ ట్రస్టు, అపోలో 24 / 7ల సహకారంతో ఈ వాక్సిన్ డ్రైవ్ పునః ప్రారంభం అయింది. పునః ప్రారంభం ఎందుకన్నానంటే .. నిజానికి ఇది మూడు వారాల క్రితమే మొదలైంది. అయితే.. వాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో గ్యాప్ వచ్చింది. ఇక ఈ వాక్సిన్ డ్రైవ్ కార్యక్రమంలో ఎంత మంది ఉంటే .. అందరికి వాక్సిన్ అందించే ప్రయత్నం చేస్తున్నాం’ అని చెప్పారు.
“ఇప్పటికే వేలమంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. కనీసం రోజుకు ఐదారు వందల మందికి వాక్సిన్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాము. అపోలో వారికీ నా అభినందనలు తెలుపుతున్నా. అలాగే ఈ కార్యక్రమంలో తప్పకుండా సినిమా కార్మికులు అందరూ పాల్గొనేలా మోటివేట్ చేసిన భరద్వాజ గారికి, ఎన్ శంకర్ , ఫెడరేషన్ ప్రసిడెంట్ అనిల్ గారికి, సెక్రెటరీ దొరై గార్లకు అభినందనలు తెలియచేస్తున్నాను. తప్పకుండా సినీ కార్మికులందరూ వాక్సిన్ తీసుకోవాలి” అని చిరంజీవి కోరారు.