రష్యా నుంచి చమురు దిగుమతులపై ఆంక్షలు విధించటంతో అమెరికాలో స్వల్పంగా పెట్రో ఉత్పత్తులు పెరుగుతాయనే అంచనా ఉంది. ఈ నేపథ్యంలో కెనడా నుంచి కీస్టోన్ XL పైప్ పైన్ పనులు పునః ప్రారంభించాలనే డిమాండ్ ఉపందుకుంది. అయితే కీస్టోన్ పైప్ లైన్ ఇప్పుడు అవసరం లేదని అమెరికా శ్వేత సౌధం వర్గాలు స్పష్టం చేశాయి. కెనడాలోని హర్దిస్తి నగరం నుంచి అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రానికి కీస్టోన్ పైప్ లైన్ పనులు జరుగుతున్నాయి. నాలుగు దశల్లో నిర్మిస్తున్న ఈ పైప్ లైన్ పనులు ఇప్పటికే మూడు దశలు పూర్తి కాగా నాలుగో దశ సందిగ్ధంలో పడింది.
ఉక్రెయిన్ పై రష్యా దాడులు 16వ రోజు కూడా కొనసాతున్నాయి. ప్రజలను తరలించేందుకు గ్రీన్ కారిడార్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించినా.. రాజధాని కీవ్, సూమీ వంటి నగరాలపై రష్యా దాడులను తీవ్రం చేసింది. దిక్కు తోచని స్థితిలో ఉన్న ప్రజలు ఫ్లై ఓవర్ ల కింద, సబ్ వే లు, సెల్లార్ లో కాలం వెళ్లదీస్తున్నారు. ఇటు ఉక్రెయిన్ సైనికులూ రాజధాని చుట్టూ గట్టి బందోబస్తుతో ప్రతిఘటించేందుకు సిద్దంగా ఉన్నారు. సూమీలో అర్ధరాత్రి రష్యా జరిపిన దాడుల్లో 22 మంది చనిపోయినట్టు ఉక్రెయిన్ వెల్లడించింది. రష్యా దాడుల నుంచి తప్పించుకునేందుకు ప్రజలు ప్రైవేట్కార్లలో నగరం విడిచి పారిపోతున్నారని సూమీ మేయర్ అలెగ్జాండర్ లైషెంకో చెప్పారు. లుగాన్స్క్లోనూ బుధవారం సాయంత్రం భారీ పేలుళ్లు జరిగాయి. జైటోమిర్లోని ఓ డార్మిటరీపై రష్యా దాడిలో నలుగురు, మరియుపోల్ లో జరిగిన వైమానిక దాడిలో 17 మంది చనిపోయారు. సెవెరోడొనెట్స్క్లో 10మంది చనిపోయారు. ఖార్కివ్లోనూ దాడులు కొనసాగుతున్నాయి.
ఉక్రెయిన్, యూరప్ దేశాలకు 13.6 బిలియన్లు
ఉక్రెయిన్, యురోపియన్ మిత్రదేశాలకు అమెరికా ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. 13.6 బిలియన్ డాలర్లు ఇచ్చేందుకు అమెరికా సెనేట్ సభ్యులు ఆమోదం తెలిపారు. 1.5 ట్రిలియన్ డాలర్ల ఫైనాన్సింగ్లో భాగంగా కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంతో పాటు.. రష్యా చేతిలో దెబ్బతిన్న ఉక్రెయిన్ కు ఈ సాయం ప్రకటించింది అమెరికా. 1.5 ట్రిలియన్ డాలర్లలో 13.6 బిలియన్ డాలర్లు తక్కువే అయినప్పటికీ.. రష్యా మెరుపు దాడులను ఎదుర్కొనేందుకు ఈ సాయం ప్రకటించినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. దీంతో పాటు యూరప్ శరణార్థుల కోసం కూడా నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.