New Pensions : వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్‌లో నూతనంగా నిర్మించిన వైకుంఠధామాన్ని మంత్రి కేటీఆర్ ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్‌తో పాటు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. మల్లాపూర్‌లో ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడారు. ఈరోజు ఉప్పల్‌లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. గతేడాది వర్షాలు బాగా కురిసినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం. ప్రతి నీటి చుక్కను మూసీలోకి వదిలేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉప్పల్ వద్ద ట్రాఫిక్ బాగా పెరిగిపోతోంది. దీంతో అక్కడ ఫ్లై ఓవర్లు, స్కైవేలు కడుతున్నామని తెలిపారు. ఉప్పల్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో రూ. 35 కోట్ల స్కై వాక్‌ను నిర్మిస్తున్నాం. దాన్ని వచ్చే నెలలోనే ప్రారంభిస్తామన్నారు. ఉప్పల్‌లో శిల్పారామం ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. సంక్షేమంలో కూడా ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటున్నాం. వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నాం. మన బస్తీ మన బడి కింద ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తున్నామని తెలిపారు. ఈ జూన్ నుంచే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నామని చెప్పారు. హైదరాబాద్‌కు నలుమూలాల వెయ్యి పడకల ఆస్పత్రులను నిర్మించబోతున్నామని స్పష్టం చేశారు. పేదలకు అవసరమైన విద్య, వైద్య, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
జాగ ఉండి ఇల్లు కట్టుకునే వారికి రూ. 3 లక్షలు ఇస్తామన్నారు. ఈ ఏడేండ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. 90 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నామని తెలిపారు. అన్ని వర్గాలకు, కులం, మతం అనే పంచాయితీ లేకుండా నిధులు కేటాయిస్తున్నాం. వచ్చే నెలలో చర్లపల్లిలో ఆర్యూబీ పూర్తి చేసి ప్రారంభిస్తామని కేటీఆర్ తెలిపారు
ఇవి కూడా చదవండి: దళితబంధు దేశంలోనే గొప్ప పథకం – మంత్రి కొప్పుల