Saturday, November 23, 2024
HomeTrending Newsవిశాఖ స్టీల్ పై ప్రధానిని కలుస్తాం: వైసీపీ

విశాఖ స్టీల్ పై ప్రధానిని కలుస్తాం: వైసీపీ

We will meet PM: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 120కి పైగా పార్లమెంటు సభ్యుల నుంచి సంతకాలు సేకరించామని, త్వరలో ప్రధాని మోడీని కలిసి దీనిపై మెమోరాండం అందిస్తామని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయి రెడ్డి వెల్లడించారు. లాభాలు ఆర్జిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు తమ పార్టీ విధానపరంగా వ్యతిరేకమన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ వద్ద ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి, వాటిని ఆ సంస్థ కార్మికులు, ఆ సంఘాల నేతలకు తాము సేకరించిన సంతకాలు చూపి ఆ తర్వాత ప్రధానిని కలుస్తామన్నారు. ఢిల్లీలో పార్టీ ఎంపీలతో కలిసి విజయసాయిరెడ్డి  మీడియాతో మాట్లాడారు

ఈనెల 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది కాబట్టి, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పనితీరును చూడమంటున్నామని, ఆ సంస్థ లాభాల్లో ఉంది కాబట్టి ఇదే విషయాన్ని కేంద్రానికి మరోసారి నివేదించనున్నామని వివరించారు. సంతకాలకు సంబంధించి టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ను అడిగితే, పార్టీ లెటర్‌హెడ్‌పై అయితే సంతకం పెట్టబోమని ఆయన చెప్పారన్నారు.

రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి ఏపీలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులపై చర్చించామన్నారు. కొన్నింటిపై ఆయన వెంటనే నిర్ణయం కూడా తీసుకున్నారని, మిగిలినవాటిపై సానుకూలత వ్యక్తం చేశారని పేర్కొన్నారు.

రైల్వే మంత్రితో చర్చించిన అంశాలపై విజయసాయి….

  • కడప బెంగళూరు లైన్‌ను వేగంగా పూర్తి చేయమని కోరగా, వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
  • ఏపీలో పండే పంటల్లో 12 శాతం పండ్లు పండుతుండగా, వాటికి కిసాన్‌ రైల్‌ ద్వారా పంపాల్సి ఉంటుంది. దేశంలో 159 రూట్లలో కిసాన్‌ రైళ్లు నడుస్తుండగా, రాష్ట్రంలో వాటిని పెంచమన్నాం. ఇక పెద్ద లోడింగ్‌ స్టేషన్‌ విజయనగరంలో మాత్రమే ఉంది కాబట్టి,  అన్ని చోట్ల కోల్డ్‌ స్టోరేజీలు ఏర్పాటు చేయమని కోరాం.
  • అలాగే ఉద్యాన పంటల ఉత్పత్తులు చెడిపోకుండా విజయనగరం, అనంతపురం, గుంటూరు, కర్నూలు, చిత్తూరులో టెంపరేచర్‌ కంట్రోల్‌ పెరిషబుల్‌ కార్గో సెంటర్లు ఏర్పాటు చేయమని రైల్వే మంత్రిని కోరాం.
  • విశాఖ నుంచి అరకు వరకు విస్టా డోన్‌ కోచ్‌లు నడుస్తున్నాయి. అయితే అవి మూడు మాత్రమే ఉన్నాయి. కాబట్టి మరో ఆరు కోచ్‌లు ఏర్పాటు చేస్తే, మొత్తం 9 బోగీలతో నడిపే వీలుంటుందని చెప్పాం. ఆ విధంగా పూర్తి స్థాయి రైలు ఏర్పాటు చేయమని కోరాం.
  • పెండింగ్‌ ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర వాటా ఇస్తే, త్వరితగతిగ పూర్తి చేస్తామని రైల్వే మంత్రి చెప్పారు.
  •  ఆ మేరకు రాష్ట్ర వాటాగా రూ.4200 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అయితే అశాస్త్రీయంగా జరిగిన విభజన వల్ల రాష్ట్రం చాలా నష్టపోయిందని, మరోవైపు ఇప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆ మొత్తాన్ని రుణంగా పరిగణించి, భవిష్యత్తులో వాయిదాల కింద కట్టే విధంగా చేయాలని కోరాం. అందుకు సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి వైష్ణవ్, ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు.
  • రైల్వే జోన్‌–వాల్తేరు డివిజన్‌, రైల్వేలో ఉద్యోగాల భర్తీ,  కంటైనర్‌ల ఉత్పత్తి, కొత్త రైళ్లు–హైస్పీడ్‌ ట్రెయిన్స్‌, ఆర్వోబీ–ఆర్‌యూబీ–స్టాపేజీ, రైళ్ల పేర్లు మార్పు లాంటి అంశాలపై కూడా చర్చించాం.

ఎంపీ పి.మిధున్‌రెడ్డి మాట్లాడుతూ, విశాఖ స్టీల్‌ ప్లాంట్, పోలవరం ప్రాజెక్టు.. ఇలా రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశంపై అయినా పార్టీలు, రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకుపోతామని చెప్పారు.

Also Read : స్టీల్ ప్లాంట్ పై డిజిటల్ క్యాంపెయిన్‌

RELATED ARTICLES

Most Popular

న్యూస్