విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణకు దీర్ఘకాలిక ఉద్యమానికి సిద్ధం అవుదామని వైయస్‌ఆర్‌సీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. ఢిల్లీలో వరుసగా రెండో రోజు కార్మికులు  నిర్వహిస్తున్న ధర్నాకు వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు మద్దతు ఇచ్చారు. నిన్న జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించిన ఉక్కు కార్మికులు మంగళవారం ఆంధ్రాభవన్‌ ఆవరణలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా విజయసాయి మాట్లాడుతూ ఉక్కు కార్మిక సంఘాలు తలపెట్టిన ఈ ఉద్యమాన్ని ఒక ఏడాది పాటు ఇదే విధంగా కొనసాగిస్తే సార్వత్రిక ఎన్నికలకు గడువు దగ్గర పడుతుందని, ఎన్నికలు ముందు పెట్టుకుని ఏ ప్రభుత్వమూ ప్రైవేటీకరణ నిర్ణయంపై ముందుకెళ్ళే అవకాశం ఉండదని సూచించారు.

ఒక సంవత్సరం పాటు దీన్ని కొనసాగించాలంటే మనం అందరం కలిసి సంఘటితంగా పోరాటం చేయాల్సి ఉంటుందని విజయసాయి రెడ్డి అన్నారు. అవసరమైతే కోర్టులను ఆశ్రయించి ప్రైవేటీకరణ ప్రక్రియపై  స్టే తీసుకువద్దామని తెలిపారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వం నిర్ణయంలోనే అనేక అవకతవకలు ఉన్నాయని, అవన్నీ ప్రభుత్వంలోని పెద్దలకు తెలుసు కాబట్టి న్యాయస్థానాల్ని ఆశ్రయించి ఈ ప్రైవేటీకరణ ప్రక్రియను నిలిపివేయడానికి ప్రయత్నాలు చేద్దామని కార్మికులతో చెప్పారు.

ఉక్కు కార్మికుల పోరాటంలో మా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి విశాఖ ఉక్కు కార్మికులు, ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడాలని ఎల్లవేళలా కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. ఉక్కు కార్మికుల పోరాటానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సహాయ, సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. “మీ వెంట ఉండి మేం నడుస్తాం. మా ఎంపీలు అంతా నిన్న, ఈరోజు ఈ ధర్నాలో పాల్గొన్నాం… మీతో కలిసి పోరాడుతామని ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా” అని  విజయసాయి రెడ్డి వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *