సికింద్రాబాద్ బోయగూడలో ఈ రోజు తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్క్రాప్ గోడౌన్‌లో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో స్క్రాప్ గోడౌన్‌లో మొత్తం 15 మందికి పైగా కార్మికులున్నట్లు డిపో యాజమాన్యం తెలిపింది. మంటల నుంచి సురక్షితంగా ఇద్దరు కార్మికులు బయటపడ్డారు. మృతులంతా బిహార్‌కు చెందిన వలస కార్మికులుగా గుర్తించారు.స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. డిపో మొత్తం టింబర్‌డిపో, స్క్రాప్ గోదాం కావడం వల్ల మంటలు త్వరగా వ్యాపించాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఐదు ఫైరింజన్లతో మంటలు ఆర్పారు. తెల్లవారుజామున 3 గంటలకు టింబర్ డిపోలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
గోడౌన్ పై అంతస్తులో రెండు గదులు ఉన్నాయి. కిందకు వెళ్లేందుకు ఇనుప మెట్ల మార్గం ఒక్కటే ఉంది. అక్కడ పనిచేసే కార్మికులు ఈ రెండు గదుల్లోనే నివసిస్తారు. రాత్రి పనులు పూర్తైన తర్వాత కార్మికులంతా తమ గదుల్లో నిద్రపోయారు. రాత్రి 02.30 గంటల సమయంలో గౌడౌన్‌లో మంటలు చెలరేగాయి. అక్కడ ఖాళీ బీరు సీసాలు, వైర్లు ఎక్కువగా ఉన్నాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. వైర్లకు వేగంగా మంటలు అంటుకోవడంతో.. పెద్ద అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. చూస్తుండగానే.. గోడౌన్ మొత్తం మంటలు వ్యాపించాయి. పైన ఉన్న కార్మికులు కిందకు వెళ్లే అవకాశమే లేకపోయింది. వారంతా ప్రాణాలను రక్షించుకునే ప్రయత్నంలో.. ముందు వైపు ఉన్న గది నుంచి చివరి గదిలోకి వెళ్లారు. ఆ గదిలోనే మృతదేహాలన్నీ లభ్యమయ్యాయి. ఒకరిపై మరొకరు పడి ఉన్నారని.. మృతదేహాలు గుర్తుపట్టరాని విధంగా ఉన్నాయని అగ్నిమాపక అధికారులు వెల్లడించారు.
సికింద్రాబాద్ బోయిగూడ స్క్రాప్ గోడౌన్‌లో జరిగిన అగ్ని ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో బీహార్ కార్మికులు మరణించడం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. అగ్ని ప్రమాదంలో మరణించిన వారికి ఒక్కొక్కరికీ రూ 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను సీఎం కేసిఆర్ ప్రకటించారు. ప్రమాదంలో మృతి చెందిన బీహార్ వలస కార్మికుల పార్థివదేహాలను వారి వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేష్ కుమార్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు.