కరోనా నిర్ధారణ పరీక్షలను వేగవంతం చేయాలని ఆంధ్ర ప్రదేశ్ హైకోర్ట్ ప్రభుత్వానికి సూచించింది. రోజువారీ పరీక్షలు ఎక్కువగా చేయాలని, రిపోర్టులు త్వరగా వచ్చేలా చూడాలని ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. కాంట్రాక్టు నర్సులకు వేతనాలు సకాలంలో చెల్లించాలని, బకాయిలను వెంటనే ఇవ్వాలని కోర్టు నిర్దేశించింది.
వృద్ధులకు వ్యాక్సినేషన్ అంశంపై కూడా విచారణ జరిగింది. ఆధార్ కార్డుతో సంబంధం లేకుండా వృద్ధులకు వ్యాక్సిన్ అందిస్తామని, రెండ్రోజుల్లో వృద్ధులందరికీ వ్యాక్సిన్ పూర్తి చేస్తామని ప్రభుత్వం కోర్టులో మెమో దాఖలు చేసింది. కరోనా నియంత్రణ చర్యలపై విచారణను హైకోర్టు సోమవారం నాటికి వాయిదా వేసింది.
మానసిక రోగులకు అందుతున్న కరోనా చికిత్సపై అడిగి తెలుసుకున్న హైకోర్టు మెంటల్ హెల్త్ యాక్ట్ ను ఏ విధంగా అమలు చేస్తున్నారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కోర్టు రెండువారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కోరింది.