న్యూజిలాండ్ తో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో యువ పేసర్ మహమ్మద్ సిరాజ్ కు అవకాశం ఇవ్వాలని భారత జట్టు మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సలహా ఇచ్చాడు. గత రెండేళ్లలో సిరాజ్ తన బౌలింగ్ కు పదును పెట్టాడని, అధ్బుతమైన పురోగతి సాధించాడని వెల్లడించాడు.
తాను కెప్టెన్ అయితే ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగుతానని, జస్ ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ కచ్చితంగా ఉంటారని, మూడో పేసర్ గా ఇషాంత్ శర్మ, మహమ్మద్ సిరాజ్ లలో సిరాజ్ వైపే తాను మొగ్గు చూపుతానని వివరించాడు. ఇషాంత్ గొప్ప బౌలర్ అయినప్పటికీ ఈ మ్యాచ్ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని సిరాజ్ అయితేనే మంచి ఛాయిస్ అవుతుందన్నాడు హర్భజన్. ఏ ఆటగాడినైనా ప్రస్తుత ఫామ్ నే పరిగణనలోకి తీసుకుంటారని… ఈ విషయంలో కూడా సిరాజ్ కే ఎక్కువ అవకాశముందన్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఒక ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు సాధించి మ్యాచ్ విజయంలో కీలక భూమిక పోషించాడని హర్భజన్ గుర్తు చేశాడు.
ప్రస్తుతం సిరాజ్ ఫామ్ ను గమనిస్తే అతని పేస్ మెరుగైందని, ఆత్మ విశ్వాసం కూడా పెరిగిందని గత ఆరునెలలుగా మంచి ఆట తీరు ప్రదర్శిస్తున్నాడని విశ్లేషించాడు. అందులోనూ వికెట్లు తీయడానికి ఆకలితో ఉన్నాడని వ్యాఖ్యానించాడు. గత కొంత కాలంగా ఇషాంత్ గాయాలతో సతమతమవుతున్నాడని, అయితే భారత క్రికెట్ కు ఇషాంత్ అందిస్తున్న సేవలు నిరుపమానమైనవని, అందులో సందేహం లేదంటూ కితాబిచ్చాడు.
2019 ఐపిఎల్ లో కోల్ కతా ఆటగాడు ఆండ్రూ రస్సెల్ బెంగుళూరుకు ఆడుతున్న సిరాజ్ బౌలింగ్ ను గ్రౌండ్ నాలుగు దిక్కులకూ బాదేశాడని, కానీ ఈ ఏడాది గమనిస్తే సిరాజ్ మంచి యార్కర్లు, బంతి బంతిని వైవిధ్యంగా వేయడంలో గొప్ప పురోగతి కనిపించిందని వివరించాడు హర్భజన్.
శుభమన్ గిల్ కు కూడా ఓపెనర్ గా అవకాశం ఇస్తే బాగుంటుందని, రాబోయే రోజుల్లో జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగే సూచనలు కనిపిస్తున్నాయని, ఈ మూడు నెలల ఇంగ్లాండ్ టూర్ లో గిల్ తన ఆట తీరుతో అందరి దృష్టి ఆకర్షిస్తాడని హర్భజన్ విశ్వాసం వ్యక్తం చేశాడు.
ఏదేమైనా హైదరాబాదీ ఆటగాడు సిరాజ్ పై హర్భజన్ ఇంతగా నమ్మకం పెట్టుకోవడం, ఆట తీరును ఈ రకంగా విశ్లేషించడం శుభ పరిణామం. చారిత్రాత్మక మ్యాచ్ లో తెలుగింటి సిరాజ్ కు అవకాశం దక్కాలని మనమూ ఆశిద్దాం .