Tuesday, June 9, 2026
HomeTrending Newsకొత్త జిల్లాల ఏర్పాటు సువర్ణాధ్యాయం: బొత్స

కొత్త జిల్లాల ఏర్పాటు సువర్ణాధ్యాయం: బొత్స

New History: కొత్త జిల్లాల ఏర్పాటు రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అభివర్ణించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా పరిపాలన సౌకర్యార్థం, ఇచ్చిన మాట తప్పకుండా పరిపాలనా వికేంద్రీకరణే లక్ష్యంగా పార్లమెంట్ నియోజకవర్గం ప్రాతిపదికన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఫలితంగా సామాన్యులకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ అవుతాయని అన్నారు. ప్రధానంగా పార్వతీపురం కేంద్రంగా ఏర్పాటవుతున్న మన్యం జిల్లాతో ఇక్కడి ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు ఒనగూరతాయని, ఈ ప్రాంత రూపు రేఖలు మరిపోతాయని అభిప్రాయపడ్డారు.  ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీ వాణితో కలిసి ఆయన ఆదివారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో పర్యటించారు. నూతనంగా ఏర్పాటవుతున్న ప్రభుత్వ కార్యాలయ భవనాలను పరిశీలించారు.

ముందుగా నూతన ఐటిడిఏ భవనంలో ఏర్పాటు చేయబోతున్న కలెక్టర్ కార్యాలయాన్ని, సమావేశ మందిరం, ఇతర అధికారుల కార్యాలయాలను పరిశీలించారు. అనంతరం స్థానిక ఆర్.సి.ఎం. స్కూల్ లో ఏర్పాటవుతున్న కార్యాలయాలను పరిశీలించి స్థానిక అధికారులకు సూచనలు చేశారు. పరిపాలనకు అనుకూలమైన ప్రాంతంలో కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారని, ఇతర పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి కార్యాలయాలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని స్థానిక అధికారులకు సూచించారు. భవనాల పరిశీలన అనంతరం మంత్రి బొత్స, ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీ వాణి స్థానిక ఐటిడిఏ కార్యాలయంలో ఐటిడిఏ పీవో కూర్మనాథ్, మున్సిపల్ కమిషనర్ సింహాచలం నాయుడు, డిఎస్పీ మోహన్ రావు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

సోమవారం నుంచి అధికారికంగా పాలన మొదలవుతుంది కావున అన్ని సాంకేతిక ప్రక్రియలను పూర్తి చేసుకొని సిద్ధంగా ఉండాలని సూచించారు. అందరూ సమన్వయంతో వ్యవహరించాలని, ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీ వాణి మాట్లాడుతూ పార్వతీపురం ప్రాంత ప్రజల ఎన్నో ఏళ్ల నాటి కల ఈరోజు తీరుతుందని హర్షం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు ఎన్నో ఇబ్బందులు పడ్డ ఈ ప్రాంత ప్రజలు ఇక నుంచి ఎలాంటి ఇబ్బందులూ పడాల్సిన అవసరం ఉండదని, పాలన ప్రజలకు చేరువ అవుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి ఈ ప్రాంత ప్రజలు రుణపడి ఉంటారని.. ఇక్కడి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటామన్నారు.

స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు, బొబ్బిలి ఎమ్మెల్యే సంబంగి చిన  వెంకట అప్పలనాయుడు, ఐటిడిఏ పీవో కూర్మనాథ్, మున్సిపల్ కమిషనర్ సింహాచలం నాయుడు, ఐటిడిఏ ఈఈ శాంతేశ్వర రావు, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

Also Read : కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular