Monday, November 25, 2024
HomeTrending Newsపంజాబ్ లో శిరోమణి-బిఎస్పీ జట్టు

పంజాబ్ లో శిరోమణి-బిఎస్పీ జట్టు

పంజాబ్ రాష్ట్రంలో కొత్త పొత్తు పొడిచింది. శిరోమణి అకాలీదళ్ – బహుజన్ సమాజ్ పార్టీ జట్టు కట్టాయి. దాదాపు 17 ఏళ్ళ తర్వాత ఈ రెండు పార్టీలూ మళ్ళీ కలిసి పోటీ చేస్తున్నాయి. పంజాబ్ చరిత్రలో ఇదో చారిత్రాత్మక రోజని శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుక్బీర్ సింగ్ బాదల్ అభివర్ణించారు. పంజాబ్ అసెంబ్లీకి 2022లో జరగబోయే ఎన్నికలతో పాటు ఇకపై జరగబోయే అన్ని ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని బాదల్ వెల్లడించారు.

‘పంజాబ్ రాజకీయాల్లో కీలక పరిణామం, ఇదొక చారిత్రాత్మక రోజు’ అని బాదల్ వ్యాఖ్యానించారు. బిఎస్పీ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మిశ్రాతో కలిసి బాదల్ మీడియాతో మాట్లాడారు. రాబోయే అసెంబ్లీ పోరులో శిరోమణి 97 సీట్లలోను, బిఎస్పీ 20 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. బిఎస్పీ పోటీచేసే స్థానాలు దాదాపు ఖరారు చేశారు.

గతంలో బిజెపితో కలిసి శిరోమణి పోటీ చేసింది. 2012 ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సంపాదించిన శిరోమణి పార్టీ, బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసే పోటీచేశాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి 23సీట్లకు, శిరోమణి 94 సీట్లలో పోటీ చేశాయి. కానీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పంజాబ్ లో అధికారంలోకి వచ్చింది.

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాలను నిరసిస్తూ శిరోమణి ఎన్డియే కూటమి నుంచి వైదొలిగింది. శిరోమణి అధ్యక్షుడు సుక్బీర్ సింగ్ బాదల్ భార్య హర్ సిమ్రత్ కౌర్ బాదల్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2022 ఫిబ్రవరిలో పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

ఈ కొత్త పొత్తుతో పంజాబ్ లో చతుర్ముఖ పోరు జరగనుంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, బిజెపి, శిరోమణి కూటమి మధ్య పోరు జరగనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్