IPL-2022: ఐపీఎల్ లో నేడు జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ 6 వికెట్లతో విజయం సాధించింది. ఢిల్లీ విసిరిన 150 పరుగుల విజయ లక్ష్యాన్ని లక్నో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే సాధించింది. గత రెండు మ్యాచ్ లలో నిరాశపరచిన క్వింటన్ డికాక్ ఈ మ్యాచ్ లో రాణించి 52 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 80 పరుగులతో రాణించాడు.
నవీ ముంబై లోని డా. డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో లక్నో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీ ఆరంభం బాగానే ఉంది, ఈ మ్యాచ్ తో ఢిల్లీ తరపున ఆరంగ్రేటం చేసిన డేవిడ్ వార్నర్ ఎక్కువ స్ట్రయిక్ ను మరో ఓపెనర్ పృథ్వీ షా కే ఇచ్చాడు. 34 బంతుల్లో 9 ఫోర్లు 2సిక్సర్లతో 61 పరుగులు చేసిన షా తొలి వికెట్ గా వెనుదిరిగాడు. ఆ వెంటనే వార్నర్ (4); పావెల్ (3) కూడా ఔటయ్యారు. ఈ దశలో కెప్టెన్ రిషభ్ పంత్, సర్ఫరాజ్ అహ్మద్ లు ఆచి తూచి ఆడారు. రిషభ్ (39); సర్ఫరాజ్ (36) పరుగులతో నాటౌట్ గా నిలిచారు. ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 149 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్ రెండు, కృష్ణప్ప గౌతమ్ ఒక వికెట్ సాధించారు.
లక్నో తొలి వికెట్ కు 73 పరుగులు చేసింది, కెప్టెన్ రాహుల్ 24 పరుగులు చేసి ఔటయ్యాడు. ఎవిన్ లూయూస్ కూడా కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. డికాక్ 80, దీపక్ హుడా 11 పరుగులు చేసి అవుట్ కాగా, తర్వాత వచ్చిన క్రునాల్ పాండ్యా-19 (14 బంతుల్లో 1సిక్సర్); ఆయుష్ బదోని -10 (3 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్) వేగంగా ఆడి జట్టును గెలిపించాడు.
డికాక్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.
Also Read : ఐపీఎల్: రాజస్థాన్ జోరుకు బెంగుళూరు బ్రేక్