DC Beat KKR: ఐపీఎల్ లో నేడు జరిగిన మొదటి మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ 41 పరుగులతో ఘనవిజయం సాధించింది. ఢిల్లీ విసిరిన 215 పరుగుల లక్ష్య సాధనలో 171 పరుగులకే కోల్ కతా ఆలౌట్ అయ్యింది. ఢిల్లీలో బ్యాటింగ్ లో పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, శార్దూల్ ఠాకూర్ సత్తా చాటగా, కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
ముంబై లోని బ్రాబౌర్న్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో కోల్ కతా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఢిల్లీ తొలి వికెట్ కు 93 పరుగులు చేసింది. పృథ్వీ షా 29 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ రిషభ్ పంత్ కూడా ధాటిగా రాణించి 14 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 27 పరుగులు చేసి ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో రెహానే కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. లలిత్ యాదవ్(1); పావెల్(8) విఫలమయ్యారు, డేవిడ్ వార్నర్ 45 బంతుల్లో 6 ఫోర్లు, 2సిక్సర్లతో 61 స్కోరు చేసి ఐదో వికెట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత అక్షర పటేల్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్ తో 22; శార్దూల్ ఠాకూర్ 11 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 29 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. కోల్ కతా బౌలర్లలో సునీల్ నరేన్ రెండు; ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, ఆండ్రీ రస్సెల్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా 21 వద్ద మొదటి వికెట్ (వెంకటేష్ అయ్యర్ 18), 38 వద్ద రెండో వికెట్ (రేహానే-8) కోల్పోయింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, నితీష్ రానా మూడో వికెట్ కు 69 పరుగులు జోడించారు. రానా 30 పరుగులు చేసి అవుట్ కాగా, అయ్యర్ 33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులు చేసి స్టంప్ ఔట్ గా వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన వారిలో రస్సెల్ (24); బిల్లింగ్స్(15) మాత్రమే ఫర్వాలేదనిపించారు. గత మ్యాచ్ లో విధ్వంసం సృష్టించిన కమ్మిన్స్ కేవలం నాలుగు పరుగులకే కులదీప్ యాదవ్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీనితో 19.4 ఓవర్లలో 171 పరుగులకే కోల్ కతా ఆలౌట్ అయ్యింది. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు, ఖలీల్ అహ్మద్ మూడు, శార్దూల్ ఠాకూర్ రెండు; లలిత్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టారు.
నాలుగు కీలక వికెట్లతో సత్తా చాటిన కుల్దీప్ యాదవ్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.
Also Read : ఐపీఎల్: ముంబై నాలుగో ఓటమి-బెంగుళూరు విన్