నైజీరియాలో జరిగిన పడవ ప్రమాదంలో 26 మంది జల సమాధి అయ్యారు. వాయువ్య రాష్ట్రం సోకోతోలోని గిదన్ మగన పట్టణం నుంచి బదియవ గ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని నైజీరియా ప్రభుత్వం ప్రకటించింది. షగారి నది మీదుగా వెళుతున్న బోటులో ప్రయాణికులు సామర్థ్యానికి మించి ఉన్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. చనిపోయినవారిలో ఎక్కువగా మహిళలు, పిల్లలే ఉన్నారు. ప్రమాదం జరిగే సమయానికి పడవలో సుమారు 35 మంది ప్రయాణికులు ఉన్నారని, ఇప్పటివరకు 29 మంది మహిళల మృతదేహాలు లభ్యమయ్యాయని, అందులో ఇద్దరు చిన్నారులవని అధికారులు తెలిపారు. ప్రమాదం ఎలా జరిగింది తెలియరాలేదు.
నైజీరియాలో పడవ ప్రమాదాలు సాధారణంగా మారాయి. గత ఏడాది మేలో నైజిరియాలోని నైగర్ నదిలో జరిగిన ఓ పడవ ప్రమాదంలో 150 మంది ప్రయాణికులు గల్లంతైన విషయం తెలిసిందే. అధ్వాన్నంగా ఉండే పడవలు, నదీ జలాల్లో పేరుకుపోయిన మట్టి దిబ్బలను పడవలు ఢీకొట్టడం, ఇతర కారణాల వల్ల తరచూ ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. పడవల్లో రక్షణ చర్యలు అంతంత మాత్రమె కాగా, కెపాసిటీకి మించి ప్రయాణికులను ఎక్కించటం ప్రధాన కారణంగా తెలుస్తోంది.
Also Read : నైజీరియాలో 45 మంది ఊచకోత