What to do?: బాపు మిస్టర్ పెళ్ళాం సినిమాలో ఒక సన్నివేశం. పాలకడలి మీద ఆదిశేషుడు. ఆ ఆదిశేషుడి మీద లక్ష్మీ నారాయణులు. నారాయణుడి పాదాలు ఒత్తుతూ శ్రీమహా లక్ష్మి గోముగా అడిగింది. ఏమిటి స్వామీ! ఎప్పుడూ ఇలాగేనా? ఇందులో మార్పేమీ ఉండదా? అని. అయ్యో! దానికేమి భాగ్యం? పొజిషన్ మారుద్దాం అంటాడు శ్రీ మహా విష్ణువు. వెంటనే మనమేమనుకుంటాం? లక్ష్మి దేవి పవళిస్తే…శ్రీ మహా విష్ణువు ఆమె కాళ్లు ఒత్తుతాడు అని. కానీ అది జరగదు. మహా విష్ణువు కాళ్ళున్న చోట తల ఉంటుంది. తల ఉన్న చోట కాళ్ళు ఉంటాయి. మహా లక్ష్మి పొజిషన్ కూడా మారుతుంది. కానీ కాళ్ళు ఒత్తుతున్నది మాత్రం మహా లక్ష్మే. వాళ్లిద్దరూ నవ్వుకుంటారు. వారితో పాటు మనమూ నవ్వుకుని…తరువాత సినిమా కథలోకి వెళ్లిపోతాం.
కొన్ని తేదీలు మారతాయి. సందర్భాలు మారతాయి. సన్నివేశాలు మారతాయి. పాత్రలు మారతాయి. పాత్రధారులు కూడా మారతారు. కానీ…ఫలితం అదే. ఫలశ్రుతి అదే. జరగబోయేది తెలిసినా జరగకుండా ఆపగలిగే అవకాశం ఉండదు. ఖర్మ ఇలా కాలుతూనే ఉందని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యుయస్ టెన్స్ లో తిట్టుకోవడం తప్ప చేయగలిగింది కూడా ఉండదు.
తెలంగాణను ఇవ్వడం ద్వారా రానున్న వెయ్యేళ్లు అధికారంలో ఉండవచ్చు అని కాంగ్రెస్ అనుకుంది. “అనుకున్నామని జరగవు అన్నీ…జరిగిన నాడే తెలియును కొన్ని…” అన్న వేదాంతాన్ని టీ ఆర్ ఎస్ కె సి ఆర్ కాంగ్రెస్ కు ఇప్పటికి రెండు సార్లు ఎన్నికల గెలుపు ఉదాహరణలతో, అంకెల లెక్కలతో స్పష్టంగా తెలియజేశారు. మూడోసారి కాంగ్రెస్ సొంత ఇంటి మనుషులకంటే టీ డి పి భవనంలో అక్షరాభ్యాసం చేసిన రేవంతుడు నయమని కాంగ్రెస్ అనుకుంది. నిజంగా కూడా రేవంత్ వచ్చాక అటో ఇటో ఎటో…కదలిక అయితే వచ్చింది.
తెలంగాణ కాంగ్రెస్ గొంతులో తాజాగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విషయం పచ్చి వెలక్కాయలా పడింది. కె సి ఆర్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కావాలని ప్రశాంత్ కిషోర్ పి కె ను అధికారికంగా నియమించుకున్నట్లు ప్రకటించారు. ఆ పి కె ఏమో కాంగ్రెస్ సోనియా, రాహుల్, ప్రియాంకలతో గంటలు గంటలు మాట్లాడుతున్నారు. త్వరలో అధికారికంగా కాంగ్రెస్ తీర్థ ప్రసాదాలు కూడా తీసుకుంటారు.
దాంతో భవిష్యత్తులో టీ ఆర్ ఎస్ తో పొత్తు ఉండనే ఉండదని తెలంగాణ కాంగ్రెస్ ఎవరూ అడక్కుండానే వివరణలు, సంజాయిషీలు, ఖండనలు ఇచ్చుకోవాల్సి వస్తోంది. కాంగ్రెస్ ఇలా వివరణలు ఇవ్వడం మొదలుపెట్టగానే పార్టీలో, బయట చర్చ మొదలయ్యింది. అనుమానాలు బలపడుతున్నాయి.
ఇప్పుడు కొన్ని ప్రశ్నలు:-
1. కె సి ఆర్ ప్రశాంత్ కిషోర్ ను వదిలించుకుంటారా?
2. ప్రశాంత్ కిషోర్ అనుకుంటున్న కాంగ్రెస్ కూటమిలో కె సి ఆర్ చేరతారా?
3. ప్రశాంత్ కిషోర్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ గెలుపు కోసం పని చేస్తున్నా…తెలంగాణా వరకు కాంగ్రెస్ ను ఓడించడానికి టి ఆర్ ఎస్ తో కలిసి పని చేస్తారా?
4. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ కు వ్యూహకర్తగా పని మొదలు పెట్టిన పి కె శిష్యుడు సునిల్ భవిష్యత్తు ఏమిటి?
5. టి ఆర్ ఎస్- తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంటు సీట్ల వరకు లోపాయికారీగానో, నేరుగానో అవగాహనకు వస్తే…?
6. ఇలాంటి రాజకీయ అయోమయ వాతావరణం టీ ఆర్ ఎస్ కు లాభమా? కాంగ్రెస్ కు నష్టమా?
7. తెలంగాణ కాంగ్రెస్ లో కె సి ఆర్ బాగు కోసం పనిచేసే వృద్ధ జంబూకాలను రేవంత్ వదిలించుకోగలరా?
8. రెండు కళ్ల జాతీయ, అంతర్జాతీయ కలలతో రెండు కళ్లల్లో తనకు తానే కారం చల్లుకున్న టి డి పి తెలంగాణాలో ఎవరి పంచన చేరుతుంది?
9. తెలంగాణ ఏర్పడ్డప్పుడు వారం రోజులు అన్నం మానేసిన జన నేత ఎటు ఉంటారో?
10. అన్నిటికీ మించి ఇక ప్రమాణ స్వీకారమే తరువాయి…అన్నట్లు…అనే నేను…అన్న స్క్రిప్ట్ ను ప్రాక్టీస్ చేస్తున్న తెలంగాణ బి జె పి కె సి ఆర్ ఉచ్చులో చిక్కుకుందా? కె సి ఆరే బి జె పి ఉచ్చులో చిక్కుకున్నారా?
బాపు మెరుపుతోనే ముగిద్దాం. తెలంగాణాలో పొజిషన్ మారాలనే ఉంది ప్రతిపక్షాలకు. మారే పరిస్థితులు ఉన్నాయా? అన్నదే వడ్ల గింజలో దాగిన బియ్యపు గింజ ప్రశ్న.
-పమిడికాల్వ మధుసూదన్
Also Read :
Also Read :