Tuesday, April 16, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఇచ్చట వ్యూహాలు అమ్మబడును

ఇచ్చట వ్యూహాలు అమ్మబడును

The Reason behind:

రాజకీయం మాటకు అసలు అర్థం సంగతేమో కానీ…
నీ రాజకీయం నాదగ్గర కాదు;
రాజకీయ నాయకుల్లా నోటికొచ్చినట్లు మాట్లాడకు;
ఎవరి రాజకీయం వారిది;
పొలిటికల్లీ కరెక్ట్;
రాజకీయ వ్యాపారం;
వ్యాపార రాజకీయం;
రాజకీయ రంగు పులుముకుంది;
రాజకీయ కోణం;
రాజకీయ ప్రయోజనం;
రాజకీయ పునరావాసం…
ఇలా రాజకీయంతో ముడిపడిన లెక్కలేనన్ని మాటలు కొత్త అర్థాలతో వాడుకలో ఉన్నాయి.

సాధారణంగా ఒక్కో వృత్తి ఉద్యోగానికి ఒక్కో అర్హత, చదువు, అనుభవం అవసరమవుతాయి. రాజకీయానికి మాత్రం ఎలాంటి చదువు, డిగ్రీలు, అర్హత అవసరం ఉండదు. వయసు ఒక్కటే కొలమానం. దాంతో ఈ దేశంలో బై డిఫాల్ట్ అందరూ రాజకీయనాయకులే అయిపోయారు. ప్రతిదీ రాజకీయమే అయిపోయింది. మన ఇంటి ముందు చెత్త బుట్ట నుండి రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుదాకా అన్నీ రాజకీయమే. అంతా రాజకీయమే.

రాజకీయాన్ని ఒక పాఠంగా చదువుకోవడానికి రాజనీతి శాస్త్రం ఉంది. అయితే ఆ రాజనీతి శాస్త్రం చదువుకున్న వారు క్లాసుల్లో పాఠాలు చెప్పుకోవడానికి మాత్రమే పనికి వస్తారు తప్ప చట్ట సభల్లో మంచి చెడులు చెప్పడానికి పెద్దగా ఉపయోగపడరు.

ఆధునిక కాలంలో రాజకీయాన్ని చదివి అర్థం చేసుకోవడం టైమ్ వేస్ట్. మనదగ్గర వందల, వేల కోట్లు ఉంటే ఎన్నికల వ్యూహకర్తలను నియమించుకోవచ్చు. మన పార్టీ మొక్క నాటి, పాదు చేసి, నీరు పోసి, అభ్యర్థులను జల్లెడ పట్టి, ప్రచార ప్రణాళికలు రచించి, ఎన్నికల్లో గెలిపించే ఏజెన్సీలు పుట్టుకొచ్చాయి.

ఆర్గానిక్ ఇనార్గానిక్ పద్ధతుల్లో ఈ ఏజెన్సీలు పార్టీని అమాంతం పైకి లేపుతాయి. కులాలు, మతాల సోషల్ ఇంజనీరింగ్ సూత్రాలను అమలు చేస్తాయి. పంచ్ డైలాగులను రాసి పెడతాయి. ప్రాడక్ట్ లాంచింగ్ ఈవెంట్లలా విజువల్ గా ఎన్నికల సభలకు కొత్త విజువల్ విలువలను అద్దుతాయి. ఒక భావోద్వేగ ఎలిమెంట్ ను రాజేస్తాయి. పార్టీకి ఒక న్యారేటివ్ లైన్ ను నిర్వచిస్తాయి. అవతలి పార్టీల మీద సామాజిక మాధ్యమాల్లో దుమ్మెత్తి పోస్తుంటాయి. ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తూ జనం నాడిని పసిగట్టి పార్టీ స్టీరింగ్ ను ఆ ప్రకారం తిప్పుతూ ఉంటాయి.

పాశ్చాత్య దేశాల్లో ఎన్నికల పనులకు ప్రయివేట్ ఏజెన్సీలు ఎప్పటి నుండో ఉన్నా…మన దేశంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ ప్రశాంత్ కిషోర్ ను ఉపయోగించుకోవడంతో ఈ వృత్తి ఒక వ్యవస్థగా, ప్రామిసింగ్ బిజినెస్ గా అందరి దృష్టిలో పడింది. మరో ఐదారుగురు ప్రశాంత్ కిషోర్ లు పుట్టుకొచ్చారు. ఎవరి వ్యాపారం వారిది. ఒకరు అమిత్ షా గొడుగు నీడలో బి జె పి కి పని చేస్తున్నారు. మరి కొందరు ప్రాంతీయ పార్టీలకు పని చేస్తున్నారు.

వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో మమతను మళ్లీ గెలిపించాక ఎన్నికల వ్యూహాల వ్యాపారం నుండి పూర్తిగా పక్కకు తప్పుకుంటున్నట్లు ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు కానీ…నిజానికి ఇదివరకటి కంటే ఆయన ఆ వ్యాపారంలో ఇప్పుడు ఇంకా బిజీగా ఉన్నారు. రాజకీయం రుచిమరిగిన వారు అందులో నుండి బయటపడడం అసాధ్యం. పైగా ప్రశాంత్ కిషోర్ ఎంత అడిగితే అంత ఇచ్చి ఆయన సేవలను కొనుక్కోవడానికి దేశంలో అనేక పార్టీలు రెడీగా ఉన్నప్పుడు…ఆ డిమాండును సొమ్ము చేసుకోకుండా ఉండడానికి ఆయనేమీ అమాయకుడు కాదు.

వార్తల్లో ఎప్పుడు ఉండాలి? ఎప్పుడు ఉండకూడదు? ఏమి మాట్లాడాలి? ఏవి మాట్లాడకూడదు? తనను తాను ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలి? ఏ పార్టీ శిబిరం వ్యాపారం చేపట్టాలి? పార్టీల అధినాయకులతో సమానంగా తన స్టేచర్ తగ్గకుండా ఎలా పై స్థాయిలో ఉండాలి? ముఖ్యమంత్రులను కూడా ఏక వచనంతో పేరు పెట్టి పిలుస్తూ ఎలా కమాండింగ్ గా మాట్లాడాలి? బార్గెయినింగ్ కు అవకాశమే లేకుండా ఎన్ని వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవాలి? లాంటి అన్ని విషయాల్లో ప్రశాంత్ కిషోర్ కు చాలా క్లారిటీ ఉంటుంది.

Political Strategists Pk

ఒకదశలో జాతీయ కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని ప్రశాంత్ కిషోర్ చేతుల్లో పెట్టడానికి ముహూర్తం నిర్ణయమైపోయింది. కొన్ని విషయాల్లో సయోధ్య కుదరక పి కె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోలేదు. ఇటీవల అయిదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో పి కె అనేక మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. పి కె మాట్లాడిన వేళ, సబ్జెక్ట్ ను గమనిస్తే బిట్వీన్ ది లైన్స్ చాలా విషయాలు అర్థమవుతాయి. ఆయన ఉద్దేశం కూడా అదే. పి కె ప్రతి మాటకు ఒక లెక్క ఉంటుంది.

పి కె బహిరంగంగా చెబుతున్న ప్రకారం:-

1 . మోడీ- షా ద్వయాన్ని ఓడించవచ్చు.
2 . ప్రస్తుత కాంగ్రెస్ కు ఆ శక్తి లేదు.
3 . నూటికి 95 శాతం ఖచ్చితంగా గెలిచే బి జె పి సీట్లలో కనీసం పదేళ్లపాటు కష్టపడి…ఆ కమలం కంచు కోటలను బద్దలు కొట్టాలి.
4 . కాంగ్రెస్ లో నైరాశ్యం ఉంది కాబట్టి…అయిదు లేదా పదేళ్ల ఈ దీర్ఘ కాలిక యుద్ధానికి మమతా బెనర్జీనో మరొకరో పూనుకోవాలి.
5 . మతం, జాతీయవాదం సున్నితమయిన అంశాలు. ఆ ముళ్లకంపలో ఇరుక్కోకుండా సోషల్ ఇంజనీరింగ్- స్థానిక సామాజిక సమీకరణాలు, స్థానిక అంశాలను అజెండాగా మలచగలగాలి.

పి కె పైకి చెప్పని విషయాలు:-
అరటి పండు ఒలిచిపెట్టినట్లు పి కె తన వ్యూహాన్ని, అమలుచేయబోయే ప్రణాళికను స్పష్టంగా, సరళంగా, అందరికీ అర్థమయ్యేలా చెప్పినట్లు అనిపిస్తుంది. కానీ...ఎన్నికల చదరంగంలో పి కె లాంటివారు ఒక పావును ఎక్కడో కదిపితే…దాని పర్యవసానం ఇంకెక్కడో…ఎప్పుడో ఉంటుంది.

రాహుల్, ప్రియాంక వెనుక సీట్లో కూర్చుని, కాంగ్రెస్ డ్రైవింగ్ సీట్లో పి కె ను కూర్చోబెట్టారన్న చెడ్డపేరు వస్తే పార్టీ ఈమాత్రం కూడా బతకదని భయపడే…పార్టీ నిర్వహణ బాధ్యతలు పి కె కు అప్పగించే విషయంలో వెనక్కు తగ్గి ఉంటారని ఇప్పుడు పి కె ఇంటర్వ్యూలను బట్టి గ్రహించాలి. ఎన్ డి టి వి శ్రీనివాసన్ జైన్ తో పి కె ఆచి తూచి మాట్లాడిన మాటల్లో…ఈమధ్య ప్రధాని మోడీతో తను సమావేశం కావడం ఒక ప్రధానమయిన విషయం. బహుశా బెంగాల్ ఎన్నికల ముందు లేదా ఎన్నికల ఫలితాల తరువాత ప్రధానిని కలిసినట్లు చెప్పీ చెప్పకుండా పి కె చెబుతున్న విషయం. ఒక పక్క మోడీని ఓడించే యుద్ధం అంటూనే మరో పక్క మోడీని కలిసిన మాట నిజం అని పి కె అంగీకరిస్తున్నారంటే…ఆయన వ్యూహమేదో ఆయనకు ఉన్నట్లు అనుకోవాలి.

Political Strategists Pk

ఎవరు అవునన్నా…కాదన్నా…ఇప్పుడు ఎన్నికల వ్యూహకర్తగా పి కె ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ముద్దొచ్చినప్పుడే చంక ఎక్కాలని సామెత. కాంగ్రెస్ తో ప్రయాణిద్దామనుకున్నాడు. కుదరలేదు. కాబట్టి కాంగ్రెస్ కే ప్రత్యామ్నాయం తయారు చేసే పనిలో ఉన్నాడు.

కొందరు రాజకీయ పార్టీలను లాగేసుకుంటారు.
కొందరు సొంతంగా రాజకీయ పార్టీలు పెట్టుకుంటారు.
కొందరు వారసత్వంగా రాజకీయాలను గ్రహిస్తారు.
కొందరు సంగ్రహిస్తారు.

పి కె అందరికీ తన సేవలను విస్తరిస్తాడు.
గెలిచే పార్టీని ఎంపిక చేసుకుని ఆ పార్టీ వెంట నడుస్తూ…ఆ గెలుపును పి కె తన ఖాతాలో వేసుకుంటున్నాడా?
గెలవలేని పార్టీని తన వ్యూహాలతో పి కె గెలిపిస్తున్నాడా? అన్నది బహిరంగ రహస్యం కాదు- అదే పి కె విజయ రహస్యం.

-పమిడికాల్వ మధుసూదన్

Must Read :

ఎన్నికల సిత్రాలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్