ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకీ తీవ్రమవుతోన్న నేపథ్యంలో విజయవాడ దుర్గ గుడి పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. దుర్గ గుడిలో రేపటి నుంచి ఏకాంతంగా ఆర్జిత సేవలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు భక్తులను దర్శనాలకు అనుమతించనున్నట్లు వెల్లడించింది. రాత్రి 7 గంటల తర్వాత దుర్గ గుడి అంతరాలయ దర్శనాలను రద్దు చేసినట్లు తెలిపింది. ఆలయ పరిసరాల్లో అర్చకులు, సిబ్బంది విధిగా మాస్కు ధరించాలని.. వారు ఏ వస్తువునూ చేతితో తీసుకోవద్దని సూచించింది. మాస్కు లేని భక్తులను గుడిలోనికి అనుమతించేది లేదని పాలక మండలి స్పష్టం చేసింది.