No question: మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని సిఎం జగన్ కు అర్ధమైందని, అందుకే రాష్ట్రాన్ని మరింతగా అప్పుల వూబిలోకి నెడుతున్నారని టిడిపి సీనియర్ నేత, మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు అనుమానం వ్యక్తం చేశారు. కేంద్రం ఇప్పటికైనా జోక్యం చేసుకోకపోతే రాష్ట్రం మరింతగా ఆర్ధిక సంక్షోభంలోకి వెళుతుందని స్పష్టం చేశారు. జగన్ ఇప్పటి వరకూ చేసిన రుణాలు ఎవరు తీర్చాలన్నదే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారిందన్నారు. అవినీతి సొమ్ముతో వచ్చే ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రాన్ని వైసీపీ దుష్ట చతుష్టయమే పట్టిపీడిస్తోందని, జగన్ తన పాలనలో విపక్షాలపై కేసులు పెట్టడం తప్ప రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమీ లేదని రామకృష్ణుడు విమర్శించారు. జగన్ చేస్తున్న సంక్షేమం మతలబు ఏమిటో ప్రజలకు అర్ధమైపోయిందని, వైసీపీ హామీలతో మోసపోయిన ప్రజలే ఆ పార్టీకి బుద్ధి చెబుతారని యనమల అభిప్రాయపడ్డారు. జగన్ చేసిన అప్పుడు, అవినీతి వ్యవహారాలను కేంద్ర ప్రభుత్వం బైటపెట్టాలని సూచించారు.