హనుమాన్ చాలీసా వివాదం మహారాష్ట్రలో దుమారం లేపుతోంది. విదర్భ ప్రాంతాన్ని సిఎం నిర్లక్ష్యం చేస్తున్నారని, రెండేళ్లుగా సచివాలయం (మంత్రాలయ) రావటం లేదని యువ స్వాభిమాన్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే రవి రాణా, ఆ పార్టీ ఎంపి నవనీత్ కౌర్ రాణా కొన్నాళ్ళుగా విమర్శలు చేస్తున్నారు. సిఎం ఉద్దావ్ థాకరే కు కనువిప్పు కలిగేందుకు ఆయన ఇంటి ముందు(మాతోశ్రీ) హనుమాన్ చాలీసా పారాయణం చేసి కనువిప్పు కలిగిస్తామని ప్రకటించటం వివాదానికి దారి తీసింది.

సీఎం ఉద్ధవ్ థాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామని నవనీత్ కౌర్ రాణా శుక్రవారం ప్రకటించారు. దాంతో శివసేన కార్యకర్తలు శనివారం ఆమె ఇంటిని చుట్టుముట్టి నిరసన తెలిపారు. పోలీసులు వారిని అడ్డుకున్నా నవనీత్‌ కౌర్ దంపతులను బయటకు రావొద్దని కోరారు. దాంతో నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రాణాలు వెనక్కి తగ్గి.. ప్రధాని పర్యటన నేపథ్యంలో తమ ప్రయత్నాన్ని విరమిస్తున్నట్టు ప్రకటించారు. అయినా వివాదానికి తెరపడలేదు. శనివారం సాయంత్రం పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

భిన్న వర్గాల మధ్య శత్రుత్వాన్ని సృష్టించేందుకు ప్రయత్నించారనే కారణంతో నవనీత్ రాణా దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివిధ సెక్షన్ల కింద ఖర్ పోలీస్ స్టేషన్‌లో వారిపై కేసు కూడా పెట్టారు. ఈ మేరకు ఈ రోజు (ఆదివారం) వారిని బాంద్రా కోర్టు హాలిడే బెంచ్ ముందు హాజరుపరిచారు. ఈ కేసులో బెయిల్‌ కోసం అప్లై చేయకూడదని, అవసరమైతే జైలుకు వెళ్లాలని నవనీత్ కౌర్ దంపతులు భావిస్తున్నట్టు తెలుస్తుంది.

రవి రాణా,  నవనీత్ ‌కౌర్‌లు ఇండిపెండెంట్‌గానే పోటీ చేసి గెలిపొందారు. రవి బద్రేరా నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. రవి స్వస్థలం అమరావతిలో శంకర్‌నగర్. బీకాం చేశారు. ఇక పంజాబ్ కు చెందిన నవనీత్‌ కౌర్ సినీ పరిశ్రమలో పలు భాషా చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు. నవనీత్ కౌర్ 2019 అమరావతి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఓ సామూహిక వేడుకలో నవనీత్ కౌర్, రవి రాణాలు 2011లో పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిద్దరు బీజేపీకి మద్దతుగా నడుచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *