Rama Teertham: రామతీర్థంలో శ్రీరామనవమి ఉత్సవాలను స్టేట్ ఫెస్టివల్ గా నిర్వహించే ప్రతిపాదనను సిఎం జగన్ పరిశీలిస్తున్నారని, వచ్చే ఏడాదికి ఇది కార్యరూపం దాల్చుతుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణతో కలిసి రామతీర్థం ఆలయ పునః ప్రతిష్టా మహోత్సవాలలో బొత్స పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆగమ శాస్త్ర పండితులు, చిన జీయర్ స్వామివారి సూచనల మేరకు నేడు సంప్రదాయ బద్ధంగా ఈ కార్యక్రమాన్ని నేడు నిర్వహించామని తెలిపారు. 500ఏళ్ళ నాటి ప్రాశస్త్యం కలిగిన ఈ దేవాలయం ప్రతిష్టను చిన్నబుచ్చే విధంగా ఎవరూ ప్రవర్తించవద్దని హితవు పలికారు.
2021 డిసెంబర్ 22ఆలయ పునర్నిర్మాణ పనులు మొదలు పెట్టి నాలుగు నెలల్లోనే పూర్తి చేసి నేడు శుభ ముహూర్తాన విగ్రహాలను పునః ప్రతిష్ట చేశామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. యాగశాల, ప్రాకరం పనులను మరో మూడు నెలల్లోనే పూర్తి చేస్తామన్నారు. దేవుడిని అడ్డు పెట్టుకొని కొందరు రాజకీయాలు చేయాలని చూశారని మంత్రి ఆరోపించారు. దేవాలయాలు, హిందూ మత విశ్వాసాల పట్ల సిఎం జగన్ కు ఉన్న చిత్తశుద్దిని ఎవరూ శంకించలేరని మంత్రి స్పష్టం చేశారు. హడావుడిగా ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారన్న వాదనను మంత్రి కొట్టిపారేశారు.
Also Read : ఉత్తరాంధ్రలో నేడు కేంద్రమంత్రి పర్యటన